Begin typing your search above and press return to search.

కూల్చివేత అంత ఈజీగా లేదట.. చుక్కలు కనిపిస్తున్నాయట!!

By:  Tupaki Desk   |   10 July 2020 1:30 AM GMT
కూల్చివేత అంత ఈజీగా లేదట.. చుక్కలు కనిపిస్తున్నాయట!!
X
కట్టటం కష్టం కానీ.. కూల్చటం ఎంతసేపు? అన్న నానుడి తరచూ వినిపిస్తుంటుంది. కానీ.. తెలంగాణ సచివాలయాన్నికూల్చివేత విషయంలో మాత్రం ఈ మాట ఏ మాత్రం సూట్ కాదని చెబుతున్నారు. సోమవారం అర్థరాత్రి తర్వాత మొదలైన కూల్చివేత పనులు.. బుధవారం రాత్రి సమయానికి మందకొడిగా సాగుతుండటం గమనార్హం. అధికారులు అనుకున్నంత వేగంగా ఈ పనుల్ని పూర్తి చేయలేకపోతున్నట్లు చెప్పాలి. దీనికి కారణం.. సచివాలయ నిర్మాణాలు బలంగా ఉండటమేనని చెబుతున్నారు.

పాతకాలపు నిర్మాణాలుకావటం.. ఒకింత బలంగా ఉండటంతో.. అధికారుల అంచనాలు లెక్క తప్పుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి సచివాలయంలోని భవనాల్ని నాలుగురోజుల్లో నేలమట్టం చేయొచ్చని భావించారు. అందుకు తగ్గట్లే అంచనాలుసిద్ధం చేశారు. కానీ.. పనులు మొదలయ్యాక కానీ భవనాల పటుత్వం ఎంతన్నది అధికారులకు అర్థమవుతోంది. దీంతో.. అనుకున్న సమయానికి భవనాలు కూల్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. అంచనాలకు భిన్నంగా సమయం తీసుకునే అవకాశం ఉంది.

దీనికి తోడు.. భవనాలకున్న తలుపులు.. కిటికీల్ని జాగ్రత్తగా తొలగించాల్సి రావటం.. వాటిని భద్రంగా ఉంచాల్సి రావటం కూడా కూల్చివేత పనులు ఆలస్యం కావటానికి మరో కారణంగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మామూలు భవనాల కంటే కూడా శిధిలమైన భవనాల్ని కూల్చటానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. పాతవి కావటం.. నిర్మాణాలు బలంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.

ఇక.. ఐదు.. అంతకంటే ఎక్కువ అంతస్తులున్న భవనాల్ని కూల్చటం అంత తేలిగ్గా లేనట్లు తెలుస్తోంది. భవనాల్ని కూల్చివేసిన తర్వాత వాటి నిర్మాణ వ్యర్థాల్ని ఎక్కడకు తరలిస్తారు? అన్న విషయంపై స్పష్టత రాని పరిస్థితి. ఏమైనా.. సచివాలయ భవనాల కూల్చివేత పనులు అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్లు చెబుతున్నారు.