Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ విమానం కూలిపోయిందా ? క్షిపణితో కూల్చేశారా ?

By:  Tupaki Desk   |   10 Jan 2020 5:16 AM GMT
ఉక్రెయిన్ విమానం కూలిపోయిందా ? క్షిపణితో కూల్చేశారా ?
X
ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌ లోని అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం ఇరాన్ క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. అది జరిగిన కాసేపటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ లో ఉక్రెయిన్‌ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఆ ప్రమాదం లో 176 మంది చనిపోయారు. ఎయిర్‌ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక కారణం తోనే విమాన ప్రమాదం జరిగిందని మొదట వార్తలు వచ్చాయి. ఐతే ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యం లో విమాన ప్రమాదం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక లోపంతోనే కూలి పోయిందా? లేదంటే ఇరాన్ దళాలు పొరపాటున అమెరికా కి చెందిన విమానం అని క్షిపణితో కూల్చేశాయా అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు ఇంజిన్‌ వైఫల్యం కారణంగానే విమానం కూలిందని మొదట ఉక్రెయిన్ ప్రకటించింది. ప్రమాదం వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని.. క్షిపణి దాడి జరగలేదని తెలిపింది. అనంతరం మరో ప్రకటన విడుదల చేసింది. అందులో ఇంజిన్‌ వైఫల్యం అనే పదాన్ని ఉక్రెయిన్ తీసేసి ,ఈ విమాన ప్రమాదానికి గల కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు తర్వాత ఒక అంచనాకి రావచ్చు అని ప్రధాని చెప్పారు. అటు బోయింగ్ సంస్థ సైతం విమాన ప్రమాదం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విమానం కండిషన్‌ లోనే ఉందని.. జనవరి 6నే టెక్నికల్ మెయింటెనెన్స్ నిర్వహించామని వెల్లడించింది. అప్పుడు ఎలాంటి సమస్యలు లేవని..అంతా బాగానే ఉందని తెలిపింది. ఉక్రెయిన్ ప్రకటన, బోయింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో విమాన ప్రమాదం పై ప్రశ్నలు అందరి లో మెదులుతున్నాయి.

అలాగే , ప్రమాదం జరిగిన తర్వాత ఇరాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు, ఆ తర్వాత ఈ ప్రమాదం పై బయటకొచ్చిన వీడియో కు పొంతన లేక పోవడంతో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగి కాలి పోయిందని ఇరాన్ ప్రభుత్వం చెప్పింది. కానీ వీడియోలో మాత్రం విమానం కాలిపోతూనే కింద పడిపోయింది. గాల్లో ఉన్న సమయంలోనే మంటలు అంటుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సేనలపై దాడులు చేసే క్రమంలో ఇరాన్ ప్రభుత్వమే, పొరపాటున విమానాన్ని కూల్చివేసి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

విమానం కూలి పోయిన ప్రాంతంలో రెండు బ్లాక్ బాక్స్‌లను ఇరాన్ రెస్క్యూ బృందం సేకరించింది. ఐతే ఆ బ్లాక్ బాక్స్‌లను అమెరికాకు గానీ, బోయింగ్ సంస్థకు గానీ ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్‌ ను ఏ దేశానికి పంపిచాలని ఇంకా నిర్ణయించలేదని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్, ఇరాన్‌ తో పాటు బోయింగ్ సంస్థ అమెరికాకు చెందినందున ఆ దేశం కూడా దర్యాప్తు లో పాలు పంచుకోనుంది. ఐతే ప్రమాదం ఇరాన్ భూభాగంలో జరగడం వల్ల తమ దేశం నేతృత్వంలోనే దర్యాప్తు ప్రక్రియ జరుగుతుందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.