Begin typing your search above and press return to search.

బుక్ చేసిన ఓలా బైక్ రాలేదు.. కేసు మాత్రం బుక్ అయ్యింది

By:  Tupaki Desk   |   21 Dec 2019 5:04 AM GMT
బుక్ చేసిన ఓలా బైక్ రాలేదు.. కేసు మాత్రం బుక్ అయ్యింది
X
రవాణా సౌకర్యాల్ని అందించే కొత్త తరహా వ్యాపారాలు కొన్నేళ్లుగా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓలా.. ఊబర్ తో పాటు పలు సంస్థలు ఇటీవల బిజినెస్ చేస్తున్నాయి. యాప్ ఆధారితంగా సేవలు అందించే ఈ సంస్థల తీరు చాలా సిత్రంగా ఉంటాయి. రైడ్ కోసం బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే.. వెంటనే ఫైన్ వేసే ఈ సంస్థలు.. తాము బుకింగ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత.. సదరు డ్రైవర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే మాత్రం సింఫుల్ గా సారీ చెప్పి.. తామేమీ చేయలేమంటూ చేతులెత్తేయటం చాలామందికి అనుభవమే.

ఇప్పుడు అలాంటి ఉదంతాలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేస్తామని చెప్పటం తెలిసిందే. మాటలే కాదు చేతల్లో చేసి చూపిస్తామన్నట్లుగా తెలంగాణ పోలీసులు తొలిసారి ఈ తరహా కేసును నమోదు చేసి ఫైన్ వేశారు. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందన్న విషయాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగి సాయితేజ ఈ నెల 18న గచ్చిబౌలిలోని మైండ్ స్పేస్ దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 వరకూ వెళ్లటానికి ఓలా బైక్ రైడ్ బుక్ చేశారు. తాను బుక్ చేసిన బైక్ రైడ్ ఎంతకూ రాలేదు.

దీంతో డ్రైవర్ కు ఫోన్ చేశాడు. రాత్రి పదిన్నర నుంచి మీ కోసమే చలిలో రోడ్డు మీద నిలుచున్నా.. అర్జెంట్ గా వెళ్లాలని చెబితే.. తాను రాలేనని.. ట్రిప్పు క్యాన్సిల్ చేయాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు బైక్ డ్రైవర్. దీనిపై ఓలా నిర్వాహకులకు ఫోన్ చేస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు.

దీంతో ఒళ్లు మండిన బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాబుల్లో సేవాలోపం జరిగితే ఎంవీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సర్వీసు ఇవ్వని ఓలా రైడర్ పై కేసు నమోదు చేయటమే కాదు రూ.500ఫైన్ విధించారు. ఈ తరహా కేసు తెలంగాణలో నమోదు కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. సో.. రైడ్లు బుక్ చేసుకునే వారు ఇష్టారాజ్యంగా క్యాన్సిల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్న పాయింట్ ను నోట్ చేసుకోవటం మర్చిపోకండి.