Begin typing your search above and press return to search.

మహిళలపై అరబ్ షేక్ ల దాష్టీకాలవీ..

By:  Tupaki Desk   |   5 March 2019 7:46 AM GMT
మహిళలపై అరబ్ షేక్ ల దాష్టీకాలవీ..
X
అరబ్ షేక్ ల దాష్టీకాలు పాతబస్తీ మహిళలకు బాగా తెలుసు. అప్పట్లో పాత బస్తీలోని పేద ముస్లిం బాలికలను, మహిళలను కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసుకొని గల్ఫ్ కు తీసుకెళ్లి వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. దీనిపై పెద్దఎత్తున అవగాహన కలగడం.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు అరబ్ షేక్ లు రూటు మార్చారు.

తాజాగా హైదరాబాద్ లో అరబ్ షేక్ లు మహిళా బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్రోకర్లు కష్టాల్లో ఉన్నవారు, పేదలైన మహిళలకు గల్ఫ్ లో ఉద్యోగాల ఆశచూపి అక్కడికి పంపిస్తున్నారు. అక్కడ మోసపోయిన బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీకావు.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతి అప్పులపాలైంది. అప్పులు తీర్చే మార్గం లేక బాధపడింది. ఇటీవలే బంధువుల ఇళ్లలో పెళ్లికి వెళితే ఓ మహిళా బ్రోకర్ పరిచయమైంది. ఆమె గల్ఫ్ లో ఉద్యోగం.. 25వేల జీతం అని యువతిని నమ్మించింది. డిసెంబర్ 9న యువతి అక్కడికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక అరబ్ షేక్ కు అప్పగించారు. ఆ షేక్ ఆమెతో వెట్టిచాకిరీ చేయించాడు. పాస్ పోర్టు, వీసా తీసుకొని తన వద్దే ఉంచుకున్నాడు. పని నచ్చక వెళ్లిపోతానని మహిళ బెదిరిస్తే రూ.3 లక్షల డబ్బు కట్టాలని.. లేకపోతే నీ స్థానంలో మరో మహిళను తీసుకురావాలని లేకుంటే పాస్ పోర్టు ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడట సదురు అరబ్ షేక్.

విషయం హైదరాబాద్ లోని తన కుటుంబ సభ్యులకు యువతి తెలుపడంతో వారు ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ ఖాలెద్ ను ఆశ్రయించారు. ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు లేఖ రాశారు. విదేశాంగ శాఖ చొరవ తీసుకొని ఆ యువతిని ఇటీవలే స్వదేశానికి తీసుకొచ్చారు. ఆమె చెప్పిన కన్నీటి కథతో అరబ్ షేక్ ల మోసాలు మరోసారి వెలుగుచూశాయి.