Begin typing your search above and press return to search.

పేప‌ర్ ఇటుక‌లుగా ర‌ద్దైన నోట్లు

By:  Tupaki Desk   |   1 Dec 2016 4:54 AM GMT
పేప‌ర్ ఇటుక‌లుగా ర‌ద్దైన నోట్లు
X
పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో బ్యాంకుల్లో జ‌మ‌చేస్తున్న రూ.500 - రూ.1000 నోట్ల‌ను ఆర్‌ బీఐ ఏం చేయ‌నుంది? ఈ సందేహం అంద‌రిలో నెలకొంది. రద్దయిన పెద్ద నోట్లు కనీసం 1500 కోట్లు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో వాటిని ఏం చేస్తారన్న అస‌క్తి నేప‌థ్యంలో తాజాగా కొత్త స‌మాచారం తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో నోట్ల ఇంతకుముందు వాటిని అక్కడ రీ సైకిల్ చేసి కాగితపు ముద్దలుగా లేదా ఇటుకలుగా తయారు చేసి గుంతలను పూడ్చేందుకు ఉపయోగించేవారు. లేదా వాటితో క్యాలెండర్లు - పేపర్ వెయిట్‌ లు - బోర్డులు తయారు చేసేవారు. ఇప్పుడు భారీ స్థాయిలో వస్తున్న నోట్లను పర్యావరణానికి హాని చేయని విధంగా వినియోగిస్తామని ఆర్బీఐ అధికారులు అంటున్నారు. ఇందుకు కేరళకు చెందిన ఓ ప్లైవుడ్ కంపెనీని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆర్బీఐ శాఖల్లో ధ్వంసం చేసిన నోట్లను గుజ్జుగా మార్చేందుకు ఈ కంపెనీకి పంపారు. 40 టన్నుల చిత్తు నోట్లను ప్రాసెస్ చేసే కాంట్రాక్టును ఈ కంపెనీకి అప్పగించారు. రూ.250కి టన్ను చొప్పున ఆ కంపెనీ చిత్తు నోట్లను గుజ్జుగా మార్చి చెక్కపొట్టుతో కలిపి చెక్క సామగ్రిని తయారు చేస్తున్నది.

ఇదిలాఉండగా...ప్రజల వద్ద ఇంకా మిగిలిపోయిన రూ.500 - రూ.1000 నోట్లను డిసెంబర్ 15 వరకు పెట్రోలు బంకులు - ఇతర ప్రభుత్వ కేంద్రా ల్లో చెల్లింపులకు చెలామణి చేసుకోవచ్చు. కానీ ఆ తరువాత తమ వద్దనున్న పెద్దనోట్లను తప్పనిసరిగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. ఇప్పటికే నవంబర్ 8నుంచి డిపాజిట్ అయిన పెద్ద నోట్లు భారీ సంఖ్యలో బ్యాంకుల్లో పోగుపడ్డాయి. ఇలా ట్రక్కుల కొద్దీ పోగవుతున్న పాతనోట్లను ధ్వంసం చేసేందుకు రిజర్వు బ్యాంకు సిద్ధమవుతున్నది. వాటన్నింటినీ నిర్మూలించేందుకు రిజర్వు బ్యాంకుకు కనీసం ఏడాది సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. రిజర్వు బ్యాంకుకు చెందిన అనేక శాఖల్లో పాత నోట్లను ముక్కలుగా చించివేసే కేంద్రాలున్నాయి. బ్యాంకుల్లో జమవుతున్న పాత నోట్లన్నింటినీ ఆ కేంద్రాలకు పంపుతారు. ప్రస్తుతం రూ.500 - రూ.1000 నోట్లు భారీ సంఖ్యలో వస్తున్నందున ఈ కేంద్రాలు కొంత కాలం తక్కువ విలువున్న నోట్లను ధ్వంసం చేసే పనిని పక్కన పెట్టవచ్చు. రద్దయిన నోట్లను బ్యాంకుల నుంచి సేకరించడం నవంబర్ 14నే మొదలుపెట్టామని, వాటిని ధ్వంసం చేయడం కూడా ప్రారంభించామని రిజర్వు బ్యాంకుకు వ‌ర్గాలు అంటున్నాయి.

-ఆర్బీఐ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2015-2016)లో మార్కెట్‌ లో చెల్లుబాటు కాని 625 మిలియన్ల వెయ్యి రూపాయల నోట్లు - 2,800 మిలియన్ల 500 రూపాయల నోట్లను ధ్వంసం చేశారు.

-గత మార్చి చివరి నాటికి రూ.500 నోట్లు 15,707 మిలియన్లు - వెయ్యి రూపాయల నోట్లు 6,326 మిలియన్లు ప్రజల వద్ద ఉన్నాయి. వీటిలో కనీసం 70% తిరిగి రిజర్వు బ్యాంకుకు చేరినా అవి 15,000 మిలియన్లకు పైగా ఉంటాయి.

-దేశవ్యాప్తంగా ఆర్బీఐకి నోట్లను తనిఖీ చేసి ధ్వంసం చేసే కేంద్రాలు 19 ఉన్నాయి. ఇవి తమ వద్దకు వచ్చే మురికినోట్లను తనిఖీ చేసి వాటి నుంచి నకిలీ నోట్లను వేరుచేసి మిగిలిన వాటిని ధ్వంసం చేస్తాయి.

-నోట్లను ధ్వంసం చేసే యంత్రాలను ఆర్బీఐ జపాన్ లేదా జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నది. ఇవి గంటకు 2.50 లక్షల నోట్లను ధ్వంసం చేస్తాయి.

-భారీ స్థాయిలో వచ్చి పడుతున్న పాత నోట్లను ధ్వంసం చేసేందుకు అన్ని కేంద్రాలలో తాము రెండు షిఫ్టులలో పనిచేయాల్సి ఉంటుందని ఆర్బీఐ వ‌ర్గాలు అంటున్నాయి. ఇటువంటి సవాలు ఎదురుకావడం ఆర్బీఐకి ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/