Begin typing your search above and press return to search.

పాత నోటుకు కొత్త డిమాండ్

By:  Tupaki Desk   |   27 Dec 2016 7:41 AM GMT
పాత నోటుకు కొత్త డిమాండ్
X
నవంబరు 8న ప్రధాని మోడీ పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ ప్రకటన చేసిన త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న పాత నోట్ల‌ను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారు. భారీ మొత్తంలో పెద్ద నోట్లు ఉన్నవారు కొంత కమీషన్ ఇచ్చి మరీ నష్టానికి వాటిని వదిలించుకున్నారు. దీంతో కమీషన్ వ్యాపారుల పంట పండింది. దేశ‌వ్యాప్తంగా ఈ దందా చాలా జోరుగా సాగింది. కోల్‌ క‌తాలోని బుర్రా బ‌జార్‌ ఇలాటి కమీషన్ వ్యాపారానికి దేశంలోనే ప్రధాన కేంద్రంగా నిలిచింది. కానీ.. ఇప్పుడు బుర్రా బజార్ లో సీన్ రివర్సవయిందట. పాత నోట్లను తక్కువ రేటుకు కొన్న చోటే ఇప్పుడు అవే పాత నోట్లను ఎక్కువ ధరకు కొంటున్నారట. రద్దయిన నోట్లకు మళ్లీ డిమాండు వచ్చింది... అందుకు కారణమూ ఉంది.

బుర్రా బజార్ లో నెల‌రోజుల క్రితం పాత వెయ్యినోటుకు రూ.800 - పాత రూ.ఐదువంద‌ల నోటుకు రూ.300 ఇచ్చి నోట్లు మార్పిడి చేసుకునేవారు. కానీ ఇప్పుడు అక్క‌డ పరిస్థితి రివర్సయింది. ఇప్పుడు పాత వెయ్యి నోటుకు రూ.1100 - రూ.500 నోటుకు రూ.550 ఇచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కారణాలున్నాయి. పలు కంపెనీలు త‌మ బ్యాలెన్స్ షీట్ల‌లో క్యాష్ ఇన్ హ్యాండ్‌ ను పెద్ద ఎత్తున చూపించుకునేందుకుగాను పాత నోట్లను వెతుకుతున్నాయి. అందుకే ఇప్పుడు వాటికి డిమాండు ఏర్పడింది.

డిసెంబ‌రు 31న ముగిసే మూడో త్రైమాసికం లోపు తాము పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వ‌హించిన‌ట్టు పేప‌ర్ల‌లో చూపించ‌డం ద్వారా త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌డ‌బ్బును తెల్ల‌గా మార్చుకునే వ్యూహంలో భాగంగానే ఇలా పాత నోట్ల‌కు డ‌బ్బులు ఎదురిచ్చి కొనుగోలు చేస్తున్నారు. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది బ్యాంకులో చూపించ‌ని సొమ్ము. నోట్లు - నాణేల‌ రూపంలో ఉండే ఈ సొమ్మును చిన్న మొత్తాల చెల్లింపుల కోసం ఉప‌యోగిస్తారు. అయితే త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల డ‌బ్బును అధికారికంగా బ్యాంకు ఖాతాలో వేసుకుని తెల్ల‌ధ‌నంగా మార్చుకునేందుకు ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ లావాదేవీలు పెద్ద‌మొత్తంలో జ‌రిగిన‌ట్టు చూపించడ‌మే ల‌క్ష్యంగా ఇలా పాత నోట్ల‌కు ఎదురు క‌మీష‌న్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.

బుర్రా బజార్లో మొదలైన ఈ దందా దేశమంతా పాకుతోంది. అందరికీ ఈ కిటుకు తెలియడంతో నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే క్రమంలో పాత నోట్ల కోసం అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ... ఇప్పటికే ఏదో రకంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి దాన్ని ఎంటర్ చేయడంతో పాత నోట్ల లభ్యత బాగా తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ తిరుపతి, విశాఖ, హైదరాబాద్ - విజయవాడల్లో పాత నోట్లు కావాలంటున్న వారు కనిపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/