Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : భారత్ కి తోలి పథకం ....దేశమంతా ఉప్పొంగిపోతోందంటూ ప్రముఖుల ప్రశంసలు !

By:  Tupaki Desk   |   24 July 2021 1:30 PM GMT
టోక్యో ఒలంపిక్స్ : భారత్ కి తోలి పథకం ....దేశమంతా ఉప్పొంగిపోతోందంటూ ప్రముఖుల ప్రశంసలు !
X
జపాన్ వేదికగా సాగుతోన్న విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌ లో భారత్ తోలి రోజే తన జయ కేతనాన్ని ఎగురవేసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని అందుకుంది. మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకాన్ని సగర్వంగా ఆదుకుంది. 49 కేజీలో ఈ విభాగంలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా 202 కిలోల బరువును ఎత్తి అవతల పారేశారు. ఈ కేటగిరీలో చైనా బంగారు పతకాన్ని అందుకుంది. భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇండోనేషియా కాంస్య పతకాన్ని సాధించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌ లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌ గా మీరా నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్‌ లో మ‌ల్లీశ్వ‌రి బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా , తాజాగా మీరాబాయ్ సిల్వ‌ర్‌ తో మెరిసింది.

వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న వెయిట్ లిఫ్టింగ్‌ లో భారత్‌ కు పెద్దగా విజయాలు దక్కలేదు. ముఖ్యంగా ఒలింపిక్స్‌ లో సత్తా చాటిందే లేదు. 1948 లండన్ ఒలింపిక్స్‌ లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తొలిసారి భారత్ పోటీపడింది. అప్పటి నుంచి ప్రస్తుతం జరగుతున్న టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు భారత్ సాధించింది ఒకే ఒక్క మెడల్. అది కూడా మన తెలుగు తేజం కరణం మళ్లీశ్వరీ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఆమె తర్వాత మళ్లీ భారత్‌ కు మీరాబాయి చాను రూపంలో పతకం దక్కింది. 2017లో వరల్డ్ చాంపియన్‌ షిప్‌ లో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది. ఆ పెర్ఫామెన్స్ అనంతరం అమెరికా వెళ్లి 45 రోజుల ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఏషియన్ చాంపియన్‌ షిప్స్‌ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన చాను.. క్లీన్ జర్క్‌ లో 119 కేజీల బరువెత్తి వరల్డ్ రికార్డు సృష్టించింది. స్కాచ్‌లో 86 కేజీల బరువు మోసింది. అంతకు ముందు 2018 కాన్వెల్త్ గేమ్స్‌ లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో తనపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్లుగానే టోక్యోలో మెరిసి విశ్వవేదికపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించింది.

మణిపూర్‌ తూర్పు ప్రాంతంలోని నన్‌ పోక్ కక్చింగా ఆమె స్వగ్రామం. ఈ ఉదయం వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ ఉండటంతో ఆ గ్రామ ప్రజలందరూ మీరాబాయి ఇంటికి చేరుకున్నారు. బంధుమిత్రులు టీవీలకు అతుక్కుపోయారు. ఉత్కంఠభరితంగా లైవ్ టెలికాస్ట్‌ ను చూస్తూ గడిపారు. ఒక్కో అంచెను దాటుకుంటూ టాప్-3 లోకి చేరుకుంటున్న కొద్దీ ఆ గ్రామంలో సందడి పెరుగుతూ పోయింది. టాప్-3లో స్థానం ఖాయం చేసుకున్న తరువాత ఇక పండుగ వాతావరణం నెలకొంది. మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మణిపూర్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. మీరాబాయి చాను తల్లిదండ్రులు సైఖోమ్ కృతి, సైఖోమ్ టోంబిలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రజత పతకాన్ని అందుకోవడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం గర్వపడేలా చేసిందని, మీరా ఖచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని చాను మాట ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజెజు తెలిపారు.

భారత్‌కు తొలి ప‌త‌కాన్ని అందించిన వెయిట్‌ లిఫ్ట‌ర్ మీరాబాయ్ చాను పై సోషల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, మ‌ణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, అస్సాం, క‌ర్ణాట‌క‌, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఇత‌ర క్రీడా ప్ర‌ముఖులు ట్విట‌ర్ లో ఆమెను ప్ర‌శంసించారు. ఇండియాను స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేశావంటూ ఆకాశానికెత్తారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ లో అద్భుతమైన ప్రదర్శన. గాయం తర్వాత మీరు చేసిన పోరాటం అసమానం. భారత్ కోసం పతకం గెలిచారు. దేశంను గర్వపడేలా చేశారు అని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌ 2021లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'టోక్యో ఒలింపిక్స్‌ లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు' రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్‌ పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌ ఆరంభంలోనే దేశానికి తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు అభినందనలు. తన పుత్రికను చూసి భారతావని గర్వపడుతోంది అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్ ద్వారా ఆమెకి విషెష్ తెలియజేశారు.