Begin typing your search above and press return to search.

లోక్ స‌భ‌కు స్పీక‌ర్ ఆయ‌నే!

By:  Tupaki Desk   |   19 Jun 2019 8:04 AM GMT
లోక్ స‌భ‌కు స్పీక‌ర్ ఆయ‌నే!
X
అంచ‌నాల‌కు ఏ మాత్రం అంద‌ని రీతిలో తెర మీద‌కు వ‌చ్చిన వ్య‌క్తి 17వ లోక్ స‌భ స్పీక‌ర్ గా ఎన్నిక‌య్యారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఓం బిర్లాను లోక్ స‌భ స్పీక‌ర్ గా ఎంపిక చేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు మోడీషాలు.

రాజ‌స్థాన్ కు చెందిన ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా ప్ర‌తిపాదించ‌గా.. స‌భ‌లోని మిగిలిన ప‌క్షాల‌న్నీ ఆయ‌న‌కు పూర్తిస్థాయి మ‌ద్ద‌తు తెలిపాయి. దీంతో.. స్పీక‌ర్ గా ఎన్నికైన ఓం బిర్లాను ప్ర‌ధాని మోడీ.. ప్ర‌తిప‌క్ష నేత అధీర్ రంజ‌న్ చౌద‌రిలు వెంట తీసుకెళ్లి ఆయ‌న్ను స్పీక‌ర్ కుర్చీలో కూర్చోబెట్టారు.

ఏక‌గ్రీవంగా ఎన్నికైన స్పీక‌ర్ ఓం బిర్లాకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అభినంద‌న‌లు తెలిపారు. అంద‌రికి ఆమోద‌యోగ్య‌మైన వ్య‌క్తిని స్పీక‌ర్ గా ఎన్నిక‌య్యార‌ని.. ఇది గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణంగా అభివ‌ర్ణించారు. వ్య‌క్తిగ‌తంగా బిర్లాతో తాను కొన్నేళ్లుగా ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు. సామాజిక సేవ‌లో ముందుండే వ్య‌క్తిగా మోడీ ఆయ‌న్ను అభివ‌ర్ణించారు.

విప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడుతూ త‌మ పార్టీ త‌ర‌ఫున ఓం బిర్లాకు అభినంద‌న‌లు తెలిపారు. ఓం బిర్లా గొప్ప సామాజిక కార్య‌క‌ర్త‌గా అభివ‌ర్ణించారు. ఈ స‌భ‌కు మీరే సంర‌క్ష‌కులు.. ఇది బ‌హుళ పార్టీల ప్ర‌జాస్వామ్యం.. ఈ కుర్చీలో కూర్చున్న మీరు పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. ప‌లు పార్టీల ప్ర‌తినిధులు కూడా ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ఓం బిర్లా ప్రొఫైల్ లోకి వెళితే..

+ 1962 నవంబరు 23న రాజస్థాన్‌ లోని కోటాలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీకృష్ణ బిర్లా, శకుంతలా దేవి. ఓం బిర్లా అజ్మీర్‌ లోని మహర్షి దయానంద్‌ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌ లో మాస్టర్స్‌ చేశారు.

+ బీజేవైఎంలో అంచెలంచెలుగా ఎదిగారు. అమిత్‌ షాతో సాన్నిహిత్యం బీజేపీలో ఆయ‌న అంత‌కంత‌కూ వృద్ధి చెందేలా చేసింది. 1987-91లో కోటా జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా.. 1991-97లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, 1997-2003లో బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

+ బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓం బిర్లా ఆ విభాగంలో అనేక పదవులు నిర్వహించటం గ‌మ‌నార్హం.

+ వ్యాపార వర్గానికి చెందిన 57 ఏళ్ల ఓం బిర్లా అమిత్‌షా, మోదీకి అత్యంత సన్నిహితులుగా పేరుంది.

+ కోటా-బుందీ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా ఆయన లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పని చేశారు.