Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాలకు బంపర్ ఆఫర్ ఇచ్చేసిన ఒమన్

By:  Tupaki Desk   |   20 Dec 2020 4:30 PM GMT
ప్రపంచ దేశాలకు బంపర్ ఆఫర్ ఇచ్చేసిన ఒమన్
X
వ్యక్తులు కావొచ్చు.. వ్యవస్థలు కావొచ్చు.. ఎవరైనా సరే కరోనా పేరెత్తితే చాలు.. తామెంతలా ప్రభావితమయ్యో చెప్పుకొస్తారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేయటం.. ఇటీవల వ్యాక్సిన్ వచ్చి.. సంపన్న దేశాల్లో టీకాలు వేసే ప్రోగ్రాం వేగంగా సాగుతోంది. రానున్న నెలలో భారత్ లోనూ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఒమన్ ప్రభుత్వం తాజాగా ప్రపంచ దేశాలకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

విజిట్ వీసాతో సంబంధం లేకుండా ఆ దేశానికి వెళ్లి పది రోజుల పాటు ఉండే అవకాశాన్ని కల్పించింది. భారత్ తో సహా ప్రపంచంలోని 103 దేశాలకు ఈ అవకాశం కల్పించింది. కారణం కరోనా అని చెప్పట్లేదు కానీ.. ఎందుకిలాంటి నిర్ణయం అన్న విషయాన్ని చెక్ చేస్తే మహమ్మారి దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపర్చుకోవటం కోసం టూరిస్టులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
గతంలో ఒమన్ లో పర్యటించాలంటే విజిటింగ్ వీసా కోసమే రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఒకవేళ ఎవరైనా తెలిసిన వారు ఉండి. స్పాన్సర్ చేస్తే వీసా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే.. తాజాగా మాత్రం అలాంటిదేమీ లేకుండా ఎవరు రావాలనుకున్నా ఎలాంటి ముందస్తు వీసా తీసుకోకుండా తమ దేశానికి రావొచ్చంటూ ఆహ్వానిస్తున్నారు. అయితే..హెల్త్ ఇన్స్యురెన్స్.. ఒమన్ కు వచ్చి పోవటానికి అవసరమైన విమాన టికెట్లతో పాటు.. సదరు విదేశీయులు ఎక్కడ బస చేయనున్నారన్న హోటల్ వివరాల్ని అందించాల్సి ఉంటుంది.

ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒమన్ నేల మీద అడుగు పెట్టిన తర్వాత నుంచి మళ్లీ రిటర్న్ ఫ్లైట్ లో ఎక్కేంతవరకు ఒమన్ పోలీసులు డేగ కన్ను విదేశీయల్ని వెంటాడుతూనే ఉంటుందని చెబుతున్నారు. వెళ్లామా? చట్టబద్ధంగా ఎంజాయ్ చేశామా? తిరిగి వచ్చామా? అన్న బ్యాచ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం కోరి తలనొప్పులు తెచ్చి పెట్టుకున్నట్లే సుమా.