Begin typing your search above and press return to search.

ఆయ‌న సీఎం క‌ల‌..జ‌మ్మూలో నెర‌వేరుతుంద‌ట‌

By:  Tupaki Desk   |   20 Jun 2018 4:20 AM GMT
ఆయ‌న సీఎం క‌ల‌..జ‌మ్మూలో నెర‌వేరుతుంద‌ట‌
X
జమ్ముకశ్మీర్ రాజ‌కీయాలు రంజుగా మారుతున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేసినట్లు మెహబూబా ముఫ్తీ వెల్లడించడంతో... ఆ రాష్ట్రంలో ప‌రిపాల‌న భ‌విష్య‌త్ ఏ మలుపులు తిర‌నుంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. తన రాజీనామా లేఖను గవర్నర్‌ కు అందజేశానని - ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆయనతో చెప్పినట్లు ముఫ్తీ చెప్పారు. బీజేపీ వైదొలగడం తననేమీ షాక్‌ కు గురి చేయలేదని ఆమె తెలిపారు. అధికారం కోసం ఈ పొత్తు కుదుర్చుకోలేదు. దీనికి పెద్ద లక్ష్యమే ఉంది. కాల్పుల విరమణ - పాకిస్థాన్‌ లో ప్రధాని పర్యటన - 11 వేల మంది యువతపై ఉన్న కేసులు ఎత్తివేయడం పొత్తు వల్లే సాధ్యమైంది అని ముఫ్తీ స్పష్టంచేశారు. జమ్ముకశ్మీర్‌ లో బల ప్రయోగం అనేది ఫలితం ఇవ్వదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. పొత్తు కొనసాగించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించామని చెప్పారు. ఆర్టికల్ 370ని - రాష్ర్టానికి ప్రత్యేక హోదాను కొనసాగించాలన్నవి తమ ప్రధాన డిమాండ్లని ఈ సందర్భంగా ముఫ్తీ వెల్లడించారు.

ఇదిలాఉండ‌గా...కాంగ్రెస్- నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ మ‌ద్ద‌తు ప్ర‌భుత్వం ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుత‌న్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గాంధీ కుటుంబానికి స‌న్నిహితుడైన ఎంపీ గులాంన‌బీ ఆజాద్ రేసులో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆజాద్‌ కు చోటు ద‌క్క‌క‌పోతే...నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా సీఎం కావ‌చ్చున‌ని అంటున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తుపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇదిలాఉండ‌గా....ఒమర్ అబ్దుల్లా ఇవాళ గవర్నర్‌ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి మెజార్టీ లేదన్నారు. జమ్మూకశ్మీర్‌ లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ ను కోరినట్లు చెప్పారు. ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన కొనసాగించరాదని కోరామన్నారు. శాసనసభను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పరిణామాలకు పీడీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. 2014లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ పార్టీకి మెజారిటీ రాలేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై తమను ఎవరూ సంప్రదించడం కానీ, తాము ఎవరినీ కలవడం కానీ జరుగలేదన్నారు.