Begin typing your search above and press return to search.

ఈ ప్ర‌త్య‌ర్థి ప్ర‌శంస మోడీకి అల్టిమేట్

By:  Tupaki Desk   |   11 March 2017 8:36 AM GMT
ఈ ప్ర‌త్య‌ర్థి ప్ర‌శంస మోడీకి అల్టిమేట్
X
రాజ‌కీయాల్లో విజ‌యం ఒక్క‌టే నాయ‌కుల స‌త్తాకు నిద‌ర్శ‌నం. అలాంటి విజ‌యాన్ని సాధించిన స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి అది కూడా సిద్ధాంతాల‌తో నిత్యం విమ‌ర్శ‌లు గుప్పించే వ్య‌క్తి ప్ర‌శంసిస్తే....ఆ ఫీలింగ్ గొప్ప‌గా ఉంటుంది. అలాంటి విజ‌యాన్నే ఇపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుభ‌విస్తున్నార‌ని చెప్పుకోవ‌చ్చు. బీజేపీ సిద్ధాంతాలంటే తీవ్రంగా విమ‌ర్శించే జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి - నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఒమర్ అబ్దుల్లా ప్ర‌ధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. జ‌మ్మూకాశ్మీర్‌ లో బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన పీడీపీ ఈ విజ‌యంపై స్పందించ‌క‌ముందే ఒమ‌ర్ రియాక్ట‌య్యారు. అంతేకాదు మోడీని ప్ర‌శంస‌ల జ‌ల్లులో ముంచెత్తారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో బీజేపీ సునామీ సృష్టించిందని ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌శంసించారు. 'ఈ విజ‌యాలు చిన్న చెరువులో అలలు కావు, ఇదో సునామీ. విపక్షాలు 2019 గురించి మరిచిపోయి.. 2024 గురించి ప్రణాళికలు వేసుకోవాలి' అని అబ్దుల్లా సూచించారు. మోడీని సవాలు చేసే జాతీయ నేత ఎవరూ లేరని స్పష్టం చేశారు. 2019లో బీజేపీకి ఏ పార్టీ పోటీ ఇవ్వలేదని ఒమ‌ర్ అబ్దుల్లా జోస్యం చెప్పారు. ఈ స్థాయిలో మోడీపై ప్ర‌శంస‌లు గుప్పించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలాఉండ‌గా... ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో దూసుకు పోతుండటంతో ఆపార్టీ శ్రేణుల్లో సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించడంతో లక్నోలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఆద్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పూవులు, కుంకుమ చల్లుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. వేల సంఖ్యలో కార్యకర్తలు లక్నో రోడ్లపై సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా, ఓటమీపాలైన సమాజ్‌ వాదీ పార్టీ ప్రధాన కార్యలయం కార్యకర్తలు లేక వెలవెలబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/