Begin typing your search above and press return to search.

ఏపీలో ఒమిక్రాన్... విజయనగరం జిల్లాలో తొలి కేసు.. నెగెటివ్?

By:  Tupaki Desk   |   12 Dec 2021 9:03 AM GMT
ఏపీలో ఒమిక్రాన్... విజయనగరం జిల్లాలో తొలి కేసు.. నెగెటివ్?
X
ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ వేరియంట్.. తొలి కేసు నమోదైంది. వ్యాప్తి వేగం రీత్యా ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ వేరియంట్ ఇప్పటివరకు దేశంలో 34 మందికి నిర్దారణ అయింది. వీరిలో కొందరు రిస్క్ జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారు కాగా మరికొందరు వారి కాంటాక్టులు. అయితే, నిన్నటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ ఈ వేరియంట్ నిర్ధారణ కాలేదు. తాజాగా మాత్రం ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల యువకుడికి కొత్త వేరియంట్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ యువకుడు గత నెల 27న ఐర్లాండ్ మీదుగా ముంబయి చేరుకుని విశాఖపట్నం వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా కరోనా పాజిటివ్ గా తేలింది. నమూనాలను హైదరాబాద్ సీసీఎంబీకి పంపగా ఒమైక్రాన్ పాజిటివ్ అని తేలింది. దేశంలో నమోదైన మొత్తం 34 కేసుల్లో మహారాష్ట్రలోనే 17 ఉన్నాయి. రాజధాని ముంబై నగరంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో ఆ నగరంలో 144 సెక్షన్ విధించారు. కాగా, విజయనగరంలో ఒమిక్రాన్ నిర్ధారణ అయిన యువకుడికి శనివారం చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినట్లు ఏపీ అధికారులు తెలిపారు. దీన్నిబట్టి అతడు కోలుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు. ముందుజాగ్రత్తగా అతడిని పరిశీలనలో ఉంచినట్లు వివరించారు. వదంతులను నమ్మొద్దని కోరారు.