Begin typing your search above and press return to search.

భారత్ లో ఒమిక్రాన్.. ఎగిసే కెరటంలా విరుచుకుపడుతుందట

By:  Tupaki Desk   |   31 Dec 2021 4:30 AM GMT
భారత్ లో ఒమిక్రాన్.. ఎగిసే కెరటంలా విరుచుకుపడుతుందట
X
కొవిడ్ ఒక్కటి సరిపోదన్నట్లుగా ఒమిక్రాన్ ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. ఈ కొత్త వేరియంట్ లో ఆసుపత్రుల్లో చేరే వారు ఎక్కువగా లేకపోవటం.. మరణాలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనంతగా ఉండటం కాస్తంత రిలీఫ్ కలిగించే అంశంగా చెప్పాలి.

భారత్ విషయానికి వస్తే.. ఒమిక్రాన్ కేసులు మొదలై కొద్దిరోజులు అవుతున్నా.. దాని తీవ్రత ఈ మధ్యనే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసుల తీవ్రత ఎంత పెరుగుతుందన్న దానిపై తాజాగా కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ ఒకరు అంచనా వేశారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా పెరిగి.. కొద్ది రోజుల తర్వాత బాగా తగ్గిపోతాయని చెబుతున్నారు. అంటే.. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి.

ఎంత ఎత్తుకు కెరటం ఎగిసినా.. కొద్ది క్షణాలకు కిందకు పడిపోవటం తెలిసిందే. ఈ అంచనా వేసిన పెద్దమనిషి పేరు పాల్ కాటుమన్. ఆయన మాటలకు ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తే.. దానికి కారణం లేకపోలేదు.
కేంబ్రిడ్జి వర్సిటీ తరఫున భారత్ కు సంబంధించిన కొవిడ్ ట్రాకర్ ను రూపొందించిన టీంలో ఆయన ఒకరు.

భారత్ లో రెండో దశ ‘‘మే’’లో మొదలవుతుందని.. ఆ సమయంలో కొవిడ్ కేసుల తీవ్రత భారీగా ఉంటుందని పక్కాగా అంచనా వేసి.. హెచ్చరించిన వ్యక్తిగా ఆయన్ను చెప్పాలి. ఆ అంచనాకు తగ్గట్లే మే లో మొదలైన కొవిడ్ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవటమే కాదు.. జూన్ రెండో వారం నాటికి తగ్గుముఖం పట్టటం తెలిసిందే. దీంతో.. ఆయన మాటకు ప్రాధాన్యత పెరిగింది.

ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఈ వేరియంట్ కేసులు ఒక్కసారిగా విరుచుకుపడినట్లుగా భారీగా కేసులు నమోదై.. తర్వాత తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీకేర్ ఫుల్ బాస్!