Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ అనుమానిత మహిళను ఎంత దారుణంగా ట్రీట్ చేశారంటే?

By:  Tupaki Desk   |   5 Dec 2021 4:22 AM GMT
ఒమిక్రాన్ అనుమానిత మహిళను ఎంత దారుణంగా ట్రీట్ చేశారంటే?
X
కరోనా అన్నంతనే ఉలిక్కిపడటం.. వణకటం లాంటివి ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు కరోనా అన్నంతనే పెద్దగా పట్టించుకోని వైనం ఈ మధ్యన మొదలైంది. ఇలాంటి వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ తెర మీదకు రావటం.. దాని తీవ్రతతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడటమే కాదు.. దానికి సంబంధించిన కేసులు వచ్చాయంటే చాలు హైఅలెర్టు అవుతున్నారు. దేశంలో మొట్టమొదటి ఒమిక్రాన్ కేసు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో బయటపడితే.. తాజాగా హైదరాబాద్ లో అనుమానిత కేసులు తెర మీదకు వచ్చాయి.

బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళ విషయంలో తీవ్రమైన గందరగోళం.. ఉరుకులు పరుగులు చోటుచేసుకోవటం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నెగిటివ్ గా తేలిన సదరు మహిళ.. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని తన ఇంటికి వచ్చిన తర్వాత.. ఆమెకు పాజిటివ్ అని తేలిందని పేర్కొంటూ హుటాహుటిన ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించటం తెలిసిందే. మీడియాలో వచ్చిన ఈ వార్తలు ఇలా ఉంటే.. వాస్తవం ఏమిటి? అసలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో నెగిటివ్ రావటం ఏమిటి? ఆ తర్వాత పాజిటివ్ గా తేలటం ఏమిటి? లాంటి ప్రశ్నలు తలెత్తక మానవు.

ఈ నేపథ్యంలో సదరు మహిళతో మాట్లాడినప్పుడు షాకింగ్ నిజాలు బయటకు రావటమే కాదు.. అధికారుల తీరు మరీ ఇంత దారుణంగానా? అన్న భావన కలుగక మానదు. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె ఏమన్నారన్నది చూస్తే.. మరీ ఇంత నిర్లక్ష్యమా? అని అధికారుల తీరుపై ఆగ్రహం కలుగక మానదు. ఇంతకూ ఆమెకు ఎదురైన దారుణ పరిస్థితుల్ని ఆమె మాటల్లోనే చూస్తే..

''నవంబరు 30 సాయంత్రం లండన్ లోని నా చంటిపాపను తీసుకొని హైదరాబాద్ బయలుదేరా. లండన్ ఎయిర్ పోర్టులో కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ ధ్రువపత్రం తీసుకున్న తర్వాత.. పరీక్షలన్ని చేసి.. నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ఎక్కించారు. డిసెంబరు 1 ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నా. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో వచ్చిన వారితో పాటు ఇతరులు 200 మందిని ఒకే వరుసలో నిలబెట్టారు. భౌతిక దూరం లాంటివి ఏమీ అక్కడ లేవు. 45 నిమిషాల్లో రిజల్ట్ ఇస్తామని.. అందుకు రూ.4500 కట్టాలని చెబితే.. చంటిపాపతో క్యూలో నిలబడలేక.. ఆ మొత్తాన్ని కట్టి పరీక్ష చేయించుకున్నా ''45 నిమిషాల్లో రిజల్ట్ ఇస్తానని చెప్పిన వారు.. రెండు గంటల తర్వాత ఫలితాన్ని ఇచ్చారు. నెగిటివ్ అని తేల్చారు. రిపోర్టు మొయిల్ చేస్తామని చెప్పారు. దీంతో ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి జీడిమెట్లలోని ఇంటికి బయలుదేరా. గంట తర్వాత ఇంటికి చేరుకున్నా. గంట తర్వాత మొదట పేర్కొన్న నెగిటివ్ కు బదులుగా పాజిటివ్ అంటూ రిపోర్టును మొయిల్ చేశారు. ఇంటికి వచ్చేసరికి పోలీసులు ఉన్నారు. షాక్ తిన్నాను. మా అమ్మకు గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాతో పాటు ఉన్న చిన్నపాపను కూడా చూడని పోలీసులు.. మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. అక్కడికే వెళ్లిపోవాలంటూ దురుసుగా మాట్లాడారు. చివరకు టాయిలెట్ కూడా వెళ్లనివ్వలేదు''

''అప్పటికప్పుడు ఉన్న పళంగా అంబులెన్సులో గచ్చిబౌలి టిమ్స్ కు తరలించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. తొలుత వచ్చిన నెగిటివ్ రిపోర్టును.. పాజిటివ్ రిపోర్టుగా తేల్చిన వైనాన్ని ఎవరు ప్రశ్నించాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? నా తప్పేం లేకుండానే.. నెగిటివ్ ఫలితాన్ని పాజిటివ్ గా చేసి.. పారిపోయిందన్న ప్రచారం చేశారు. మీడియాలో మా ఫోటోల్ని ప్రముఖంగా చూపిస్తున్నారు. యూకేలోని నా భర్త కుటుంబం ఎంతటి మనోవ్యధను అనుభవిస్తుందో మాటల్లో చెప్పలేను. ఇదంతా కూడా ఎవరో చేసిన తప్పునకు మేం బలి కావటం ఏమిటి? ఇలాంటి ప్రచారం ఏమిటి?'' అంటూ ఆమె వాపోయారు. నిజమే కదా? ఒకరి నిర్లక్ష్యానికి.. మరొకరు బలి కావటం అంటే ఇదేనేమో?