Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: తెలంగాణకు వచ్చిన ‘ఒమిక్రాన్’ వైరస్

By:  Tupaki Desk   |   15 Dec 2021 6:29 AM GMT
బ్రేకింగ్: తెలంగాణకు వచ్చిన ‘ఒమిక్రాన్’ వైరస్
X
ప్రపంచాన్ని మరోసారి భయంలోకి నెట్టింది ఒమిక్రాన్. అత్యంత వేగంగా ఈ వైరస్ విస్తరిస్తోంది. అంతకుముందున్న వేరియంట్ కంటే ఇది ఐదురేట్ల జెట్ స్పీడ్ తో మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తోంది.

కరోనా నివారణకు రెండు డోసుల టీకా వేసుకున్న వారిని సైతం ఒమిక్రాన్ వదిలిపెట్టడం లేదు. ఇప్పటి వరకు 50 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ ఆ తరువాత మరికొన్ని దేశాలకు వెళ్తుందనడంలో సందేహం లేదంటున్నారు వైద్య నిపుణులు.

దీంతో చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై భారీ నిఘా పెట్టారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఒమిక్రాన్ చాలా డేంజర్ అని.. అయితే మరణాల శాతం తక్కువ అని తెలిపింది.

ఈ వైరస్ ను కొనుగొన్న సౌతాఫ్రికాలోనూ ఎవరూ చనిపోలేదని అక్కడి వైద్య శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదించారు. అయితే తాజాగా బ్రిటన్ లో ఒమిక్రాన్ మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది.

నిన్నటివరకూ భారత్ లో 37 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ ఒక కేసు వెలుగుచూసింది. ఇప్పుడు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉంది.

కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. మరోవైపు విదేశాల నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చి ఇక్కడి నుంచి కోల్ కతా వెళ్లిన మరో వ్యక్తికి కూడా ఒమిక్రాన్ గా తేలింది.

దీంతో తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. హైదరాబాద్ లోని మెహిదీపట్నం ప్రాంతంలోనే ఈ రెండు కేసులు నమోదు అయ్యాయి. ఒకరు కెన్యా నుంచి మరొకరు సొమాలియా నుంచి వచ్చారని.. ఆ ఇద్దరు వ్యక్తుల కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ కు తరలించామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

ఇప్పటివకూ తెలంగాణలో 678688 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రారంభం అయిన తర్వాత విదేశాల నుంచి 5396 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులు ఆస్పత్రి నుంచి పారిపోయినట్టు ప్రచారం సాగింది.