Begin typing your search above and press return to search.

కొవిడ్ క‌ర్ఫ్యూపై.. ఏపీ స‌ర్కారు వెన‌క్కి.. ఎందుకంటే!

By:  Tupaki Desk   |   11 Jan 2022 2:36 PM GMT
కొవిడ్ క‌ర్ఫ్యూపై.. ఏపీ స‌ర్కారు వెన‌క్కి.. ఎందుకంటే!
X
రాష్ట్రంలో మంగ‌ళ‌వారం నుంచి తలపెట్టిన రాత్రి కర్ఫ్యూ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత.. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూపై తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేస్తూ.. తాజాగా ఆదేశాలను జారీ చేసింది.

సంక్రాంతి పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని.. వారికి ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేశామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. మూడోదశ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలన్న ఆయన.. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని చెప్పారు. కరోనా కట్టడిలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

వాణిజ్య దుకాణాలు, మాల్స్‌ తదితర వాటిల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే రూ.10 వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం మందికే అనుమతించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మంగ‌ళ‌వారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. తాజాగా కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపు ఇస్తూ జీవో జారీ చేసింది.

ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మింహాయింపు ఇచ్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించాలని, వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కోవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.