Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే గవర్నర్ తో జగన్ భేటీ

By:  Tupaki Desk   |   6 April 2022 9:23 AM GMT
ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే గవర్నర్ తో జగన్ భేటీ
X
ఇంతకాలం రాజకీయం మీద ఫోకస్ పెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ ఏదో ఒక సంచలనానికి.. రాజకీయ అలజడికి కేరాఫ్ అడ్రస్ గా మారిన వైనం తెలిసిందే. పాలన మీద కంటే కూడా రాజకీయ అంశాలకే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న పేరుంది. నిజానికి ఈ తీరు ఆయనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేయటంతో పాటు.. పెద్ద ఎత్తున నెగిటివిటీకి కారణమైంది. అయినప్పటికీ ఆయన తగ్గలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగేందుకు ఏం జరిగినా ఫర్లేదన్నట్లుగా ఆయన తీరు ఉండేది. ఈ కారణంతోనే డెవలప్ మెంట్ పరంగా ఏపీ వెనుకబడిందన్న ఆరోపణల్ని మూట కట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. తన పదవీ కాలం మరో రెండేళ్లకు వచ్చేసిన నేపథ్యంలో.. ఆయన పాలన మీద ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నట్లు చెప్పక తప్పదు. ఎన్నికల వేళ.. పాలనా పరమైన హామీల్లో కీలకమైన కొత్త జిల్లాల్ని ఇప్పటికి ఆయన అమల్లోకి తేగలిగారు. అదే సమయంలో.. తన టర్మ్ మొత్తంలో సగ భాగం అయ్యాక కొత్త టీంతో పని చేస్తానని చెప్పిన ఆయన.. ఎట్టకేలకు కొత్త టీం చేత ప్రమాణస్వీకారం చేయించే పనికి ముహుర్తం కూడా పెట్టేసుకున్నారు. ఈ నెల 11న ఉదయం వేళలో కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఇలా వరుస పెట్టి పాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన.. అందుకు తగ్గట్లుగా ప్లాట్ ఫాంను సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు తెర తీసిన ఆయన.. దేశ రాజధానిలో అడుగు పెట్టిన నాటి నుంచి వరుస పెట్టి భేటీల మీద భేటీలు చేపట్టారు.

ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సహ పలువురితో మంతనాలు జరిపిన ఆయన.. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం గన్నవరానికి రానున్నారు. అనంతరం తాడేపల్లికి చేరుకోనున్న సీఎం జగన్.. ఈ సాయంత్రం ఏపీ గవర్నర్ తో భేటీ కానున్నారు.

ఈ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరిన జగన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి చేరుకోనున్నారు. అనంతరం కొన్ని సమీక్షలు నిర్వహించి.. సాయంత్రం ఐదున్నర గంటల వేళలో రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు.. త్వరలో పునర్ వ్యవస్థీకరించే కొత్త మంత్రివర్గం గురించి చర్చలు జురపనున్నట్లు తెలుస్తోంది.

మంత్రుల ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆమోదంతోపాటు.. ఆయన సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాల్ని మాట్లాడేందుకు గవర్నర్ తో భేటీ కానున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి పాలనా పరమైన విధానాల్లో మార్పుల కోసం జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పక తప్పదు.