Begin typing your search above and press return to search.

పార్టీల ఉచిత హామీల‌పై.. సుప్రీం సీరియ‌స్‌.. విచార‌ణ ప్రారంభం

By:  Tupaki Desk   |   25 Jan 2022 12:30 PM GMT
పార్టీల ఉచిత హామీల‌పై.. సుప్రీం  సీరియ‌స్‌.. విచార‌ణ ప్రారంభం
X
దేశ‌వ్యాప్తంగా వివిధ రాజ‌కీయ పార్టీలు.. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనే క్ర‌మంలో ఎన్నిక‌ల వేళ 'ఉచిత' హామీలు ఇస్తున్న‌ విష‌యం తెలిసిందే. అయితే.. ఇలా ఉచితాలు ఇస్తూ..పోతే..దేశంలో ఆర్థిక సంక్షోభం త‌లెత్తుంద‌ని.. దీనిని నివారించాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం కోర్టు.. మోడీ నేతృత్వంలోని కేంద్రప్ర‌భుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలు చేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల కింద సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాంటి పార్టీలకు త‌గిన బుద్ధి వ‌చ్చేలా.. ఎన్నికల గుర్తును నిలిపివేయడం లేదా పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిటిషనర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. వాస్త‌వానికి ఈ వాద‌న ఎప్ప‌టి నుంచో దేశ‌వ్యాప్తంగా ఉంది. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓట్లు అమ్ముకుంటున్నారు.. అని ప్ర‌జాసంఘాలు వాద‌న లేవ‌నెత్తుతున్నాయి.

అయితే.. ఇప్ప‌డు న్యాయ‌పోరాటం ప్రారంభించారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీం కోర్టు .. దీనిపై స్పంద‌న తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. 4 వారాల్లోగా దీనికి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మేర‌కు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఓటర్ల మన్నన పొందడం కోసం రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తూ అడ్డదారుల్లో అమలు చేస్తున్న ప్రజాకర్షక విధానాలను నిషేధించాలని పిటిషనర్ కోరారు. ఓటర్లను మభ్యపెట్టి అనుచిత లబ్ధి పొంది తద్వారా అధికారంలో కొనసాగేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు ఎన్నికల పవిత్రతను దెబ్బతీస్తాయ ని అన్నారు. పోటీ చేసే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆదర్శానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. సముచిత నివారణ చర్యలు తీసుకునేలా భారత ఎన్నికల సంఘానికి ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేప‌థ్యంలో సుప్రీం కోర్టు విచార‌ణ‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది.