Begin typing your search above and press return to search.

చీరాల, గన్నవరం వైసీపీలో వర్గ పోరు...కారణమిదే

By:  Tupaki Desk   |   2 Sep 2020 3:30 PM GMT
చీరాల, గన్నవరం వైసీపీలో వర్గ పోరు...కారణమిదే
X
వైసీపీలో వర్గపోరు చాపకింద నీరులా పాకుతోంది. వైఎస్ వర్థంతి సందర్భంగా కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి. ప్రకాశం జిల్లా చీరాలలో కరణం, ఆమంచి వర్గపోరు మరోసారి బయటపడింది. వైఎస్సార్ వర్థంతి సందర్భంగా కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, నాయకులు, కార్యకర్తలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ప్రమాణం చేశామని...అందుకు ప్రయత్నిస్తున్నామని కరణం వెంకటేష్ అన్నారు. గతంలోలాగా ఇక్కడ అరాచకాలు, బెదిరింపులు సాగవని, బెదిరిస్తే చూస్తూ కూర్చోరు... జాగ్రత్త అంటూ ఆమంచిని ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. చీరాల అభివృద్ది కోసమే అంతా వైసీపీలోకి వచ్చామని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అందరం కలిసి చీరాలను అభివృద్ది చేసుకుందామని కరణం వెంకటేష్ పిలుపునిచ్చారు. అయితే, ఈ వ్యాఖ్యలను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పందించారు. తన పేరు ఉచ్ఛరించడానికి భయపడేవాడు కూడా వార్నింగ్ ఇస్తున్నారని, జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారని విమర్శించారు. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు తన గురించి మాట్లాడతారా...అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నానని ఆమంచి స్పష్టం చేశారు.

మరోవైపు, గన్నవరంలో వైసీపీ వర్గపోరు తీవ్రమవుతోంది. వైఎస్ వర్థంతి కార్యక్రమం సందర్భంగా మరోసారి వైసీపీలో విబేధాలు బయటపడ్డాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వర్గీయుల మధ్య విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. ఉంగటూరు మండలంలోని తేలప్రోలులో వైఎస్ విగ్రహానికి దుట్టా వర్గీయులు పూలమాల వేయడంతో వివాదం రాజుకుంది. మంత్రులు, ఎమ్మెల్యే రాకముందే వైఎస్ విగ్రహానికి దుట్టా వర్గీయులు పూలమాల వేయడంతో దుట్టా వర్గీయులపై వంశీ వర్గీయులు ఆగ్రహం వ్యక్త చేశారు. మరోవైపు, వంశీ తీరుపై దుట్టా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ కు వంశీని తాను పరిచయం చేశానని, వైఎస్ కుటుంబానికి తాను సన్నిహితుతుడినని అన్నారు. చాలా ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నామని, బ్రతికున్నంత కాలం వైసీపీలోనే ఉంటానని దుట్టా అన్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తే సహించబోనని,రాబోయే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్థినని ప్రకటించుకున్నారు దుట్టా. మరి, ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ వర్గపోరుపై అధిష్టానం ఫోకస్ పెట్టకుంటే పార్టీకి నష్టమని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.