Begin typing your search above and press return to search.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపుపై.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 March 2021 5:32 AM GMT
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపుపై.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
X
ఒక కేసు విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు.. నియామకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు. హైకోర్టు న్యాయమూర్తిని ఏ రీతిలో అయితే తొలగిస్తారో.. అలాంటి నిబంధనలే పాటించాలన్న సుప్రీం.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ గోవా ఎన్నికల కమిషనర్ ఉదంతాన్ని చూస్తే.. ఆ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అదనపు బాధ్యతల్ని అప్పగించటాన్ని సవాల్ చేస్తూ కేసు దాఖలైంది.

దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం తాజాగా.. జస్టిస్ నారిమన్.. జస్టిస్ గవాయ్.. జస్టిస్ హ్రషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల నియామకంలో అనుసరించాల్సిన పద్దతులపై జస్టిస్ నారిమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేం చెప్పారంటే..

- రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె అప్పగించిన బాధ్యతల్ని విస్మరించటం అత్యంత ఆవేదనను కలిగిస్తోంది.
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండే వ్యక్తి రాష్ట్రంలో మున్సిపాల్టీలు.. పంచాయితీల్లాంటి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తూ.. అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు.
- కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా.. స్వతంత్రంగా ఉండాలి.
- ఈ బాధ్యతలు నిర్వర్తించే వారిని పదవి నుంచి తొలగించటానికి అనుసరించాల్సిన విధానం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(2) లో స్పష్టంగా పొందుపరిచిన నిబంధనల్ని చూస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వతంత్రతకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారన్నది స్పష్టమవుతుంది.
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించేటప్పుడు హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన నిబంధనల్ని అనుసరించాలి. అలాంటి ముఖ్యమైన.. స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన పదవిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే అధికారిని నియమించటం అన్నది మా వరకు రాజ్యాంగం అప్పగించిన బాధ్యతల్ని అపహాస్యం చేయటమే.
- న్యాయశాఖ కార్యదర్శికి ఎన్నికల కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించటం ద్వారా ఆర్టికల్ 243కె కింద రాజ్యాంగం అప్పగించిన బాధ్యతల్ని గోవా ప్రభుత్వం విస్మరించింది.
- ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించినా వారు పూర్తి స్వతంత్ర వ్యక్తులై ఉండాలి.
- కేంద్ర.. రాస్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వారికి ఆ బాధ్యతల్ని అప్పగించొద్దు. ఒకవేళ ఏ రాష్ట్రంలో అయినా అలాంటి వ్యక్తులు ఈ పదవిలో ఉంటే తక్షణం దిగిపొమ్మని కోరాలి.
- భవిష్యత్తులో ఈ ఆదేశాల్ని మిగిలిన రాష్ట్రాలన్ని తూచా తప్పకుండా పాటించాలి.