Begin typing your search above and press return to search.

సార్ సీన్ ఎంతో చెప్పే రెండు ఎమ్మెల్సీ విజయాలు

By:  Tupaki Desk   |   21 March 2021 5:30 AM GMT
సార్ సీన్ ఎంతో చెప్పే రెండు ఎమ్మెల్సీ విజయాలు
X
నాలుగు రోజుల పాటు ఊరించి.. ఊరించి ఉక్కిరిబిక్కిరి చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి. రెండింటిని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఈ రెండు విజయాల్లో ఏది ఎక్కువ? ఏది తక్కువ? అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. రెండు స్థానాల్లోనూ అధికారపక్షానికి దేనికదే అన్నట్లుగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాటిని అధిగమించి మరీ విజయాన్ని సాధించటం అంత తేలికైన విషయం కాదు. తాజా ఎన్నికల ఫలితాల పుణ్యమా అని సాగర్ ఉప ఎన్నికకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటమే కాదు.. ఎన్నికల గెలుపునకు పెద్ద సారు గీచే వ్యూహం పక్కాగా వర్కువుట్ అవుతుందన్న విషయం తెలిపోయింది.

తాజాగా గెలిచిన రెండు పట్టభద్రుల స్థానాల విజయాన్ని ఎవరి ఖాతాలో వేయాలన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం లభిస్తోంది. విజేతలుగా నిలిచిన పల్లా రాజేశ్వరెడ్డి.. సురభి వాణీదేవిలు కనిపించినా.. అసలు క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ దేనని చెప్పాలి. దీనికి కారణాలు లేకపోలేదు. ఇద్దరు అభ్యర్థుల్ని బరిలోకి దింపిన కేసీఆర్.. ఎన్నికల్లో వారు గెలిచే విషయంలో కేసీఆర్ అనుసరించిన విధానాలు.. అమలు చేసిన వ్యూహాలే ఎన్నికల్లో గెలుపునకు దోహదం చేశాయని చెప్పాలి.

గతంలోనూ వ్యూహాలు రచించినా.. అప్పుడు రాని గెలుపు.. ఇప్పుడే ఎందుకు వచ్చిందన్నది అసలు ప్రశ్న. దీనికి గులాబీ నేతలు చెబుతున్నది ఒక్కటే.. ఈసారి ఎన్నికల్ని ఎవరికి అప్పజెప్పకుండా.. అందరిని ఇన్వాల్ చేస్తూ.. తాను స్వయంగా పర్యవేక్షించిన కేసీఆర్ మానిటరింగ్ మాత్రమే టీఆర్ఎస్ కు గెలుపును సొంతమయ్యేలా చేసిందని చెప్పాలి. అభ్యర్థుల ఎంపిక మొదలు.. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఎవరు.. ఎలాంటి వ్యూహాల్ని అమలు చేయాలన్న అంశంపై కేసీఆర్ ప్రదర్శించిన నైపుణ్యమే.. తాజా డబుల్ గెలుపునకు కారణంగా చెప్పక తప్పదు. ఎన్నికల రణరంగంలోకి సారు స్వయంగా దిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా తాజా డబుల్ గెలుపు నిలిచిందని చెప్పక తప్పదు.