Begin typing your search above and press return to search.

మరోసారి మెగా కాంపౌండ్ కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ!

By:  Tupaki Desk   |   11 Oct 2021 8:49 AM GMT
మరోసారి మెగా కాంపౌండ్ కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ!
X
అంతులేని అభిమానం. వారి మాటకు ఊగిపోయే లక్షలాదిగా ఉండే అభిమానులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎంతమంది ఉన్నా.. మెగా అభిమానులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అభిమానానికి మించిన స్థాయిలో ఉండే ఈ తీరును సరిగా ఉపయోగించుకుంటే అంతకు మించిన బలం ఇంకేం ఉంటుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. మెగా కాంపౌండ్ కు తన అభిమానుల్ని అస్త్రంగా సంధించుకునే విషయంలో వారు వేసే తప్పటడుగులు వారికి తరచూ ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అభిమానుల అభిమానాన్ని ఏ రీతిలో వాడాలన్న దానిపై వారికున్న అస్పష్టతే దీనికి కారణంగా చెప్పాలి.

సాధారణంగా సినిమా రంగానికి చెందిన వారికి సాధారణ ప్రజల్లో ఉండే అభిమానం వేరుగా ఉంటుంది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చాలామంది సక్సెస్ అయ్యారు. కానీ.. అందుకు భిన్నంగా మెగా ఫ్యామిలీ మాత్రం తరచూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. మిగిలిన విషయాల్లో తమ అధిక్యతను స్పష్టంగా ప్రదర్శించే వారు.. ఎన్నికలు.. రాజకీయాల వరకు వచ్చేసరికి మాత్రం తమ బలహీనతను చాటి చెబుతుంటారు. తాజాగా ముగిసిన ‘మా’ ఎన్నికలు దీనికి నిదర్శనంగా చెప్పాలి.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ‘మా’ ఎన్నికల్లో గడిచిన నాలుగు దఫాలుగా మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసిన వారే విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలా అని తమ మద్దతును ఓపెన్ గా కాకుండా లోపాయికారీగా ఇవ్వటం.. తెర వెనుక ఉండి పావులు కదపటం చేస్తుంటారు. దీంతో మెగా వారి అండ ఒక దన్నుగా పని చేసి.. మిగిలిన వారిని కలుపుకుపోవటం ద్వారా విజయాన్ని సొంతం చేసుకునే వారు.

తాజాగా జరిగిన ‘మా’ ఎన్నికలు అందుకు భిన్నమైన వాతావరణంలోజరిగాయన్నది తెలిసిందే. ‘మా’ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత పోటాపోటీగా ఈసారి ఎన్నికలు జరిగాయి. ఒక దశలో రాజకీయ ఎన్నికలకు మించిన ఎత్తుగడలతో ఈ ఎన్నిక సాగింది. ఈ మొత్తం ప్రక్రియను చూసిన వారు.. చివరకు ఫలితాన్ని చూశాక అర్థమైన విషయం ఏమంటే.. మెగా కాంపౌండ్ కు ఎన్నికల్ని ఎలా డీల్ చేయాలి? పోల్ మేనేజ్ మెంట్ విషయంలో వారెంత వీక్ అన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఇప్పుడు జరుగుతున్న రాజకీయ ఎన్నికల్ని చూస్తే.. అభ్యర్థి ఎంత మంచివాడైనప్పటికీ.. అతడెంత సమర్థుడైనప్పటికీ.. చేయాల్సినవి.. జరగాల్సినవి తెర వెనుక జరిగిపోతాయి. అంతే తప్పించి.. మడి కట్టుకొని కూర్చోవటం ఉండదు. మీ అభిమానం అభిమానమే.. మా సంతోషం సంతోషమే.. అన్న రీతిలో దేనికదే అన్నట్లుగా వ్యవహరించే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ వరకు వస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు కేటీఆర్.. హరీశ్ లాంటి వారు పోటీ చేసే స్థానాల్లో ఖర్చు లేకుండానే గెలుస్తారా? అంటే.. మామూలు కంటే ఎక్కువే ఖర్చు చేసే పరిస్థితి ఉంటుందని చెబుతారు.

మనమింత తోపులం.. మనం పోటీ చేస్తుంటే.. ఇవ్వాల్సింది ఇవ్వకుండా.. ఖర్చుపెట్టాల్సింది ఖర్చు పెట్టకుండా గెలిచిపోతామా? అన్న చర్చను దగ్గరకు కూడా రానివ్వరు సరి కదా.. కిలో మీటర్ దూరాన ఆపేసి.. మీ పని మీరు చేయాల్సిన రీతిలో చేయమని చెబుతారు. ఏపీ విషయానికి వస్తే..కొమ్ములు తిరిగిన మొనగాడు లాంటి అధినేత మొదలు.. మిగిలిన నేతలు సైతం ఖర్చు విషయంలో అస్సలు తగ్గరు. కానీ.. మెగా కాంపౌండ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారని చెబుతారు. తమకున్న అభిమానాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవటం.. పెట్టాల్సిన ఖర్చు పెట్టకుండా ఉండటం.. వ్యూహాత్మకంగా చేయాల్సిన పనుల్ని చేయకుండా ఉండటం లాంటి వాటితో పాటు.. ఎవరిని ఎప్పుడు.. ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయంలో జరిగే పొరపాట్లు వారిని దెబ్బ తీసేలా చేస్తాయని చెబుతారు.

పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. దీనికి కారణం ఏమిటన్న దాని మీద సరైన విశ్లేషణ ప్రధాన మీడియా సంస్థల్లో ఎక్కడా కనిపించదు. లోతైన అధ్యయనం చేస్తే.. దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకువస్తాయి. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన బలం తిరుగులేనిది. కానీ.. ఆయన్ను వ్యతిరేకించే వర్గాన్ని సరైన సమయంలో కలిసి.. వారిని సంతోష పెట్టే విషయంలోనూ.. పోల్ మేనేజ్ మెంట్ లో జరిగిన పొరపాట్లు.. పైసా కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదన్న మాటలే ఆయన ఓటమిని డిసైడ్ చేశాయి. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ లాంటి వ్యక్తి పోటీ చేసిన సమయంలో.. ఆయన మీద అభిమానంతో కొందరుస్థానికంగా.. తమ వంతుగా చేసిన ఖర్చు ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసిందని చెబుతారు. అలా మొదటిసారి తనను గెలిపించిన వారి విషయంలోజేపీ వ్యవహరించిన తీరు.. రెండోసారి ఆయన ఓటమికి కారణమైందని చెబుతారు.

మిగిలిన వాటితో పోలిస్తే.. పోల్ మేనేజ్ మెంట్ చాలా భిన్నమైనది. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు.. నాగబాబు.. పవన్ కల్యాణ్ తరచూ తప్పులు చేస్తూనే ఉంటారు.చిరంజీవి విషయాన్నే తీసుకుంటే.. ఆయన రెండుచోట్ల పోటీ చేసే వేళలో.. తిరుపతి కాకుండా కాకినాడ స్థానాన్ని ఆయన ఎంచుకోవాల్సి ఉన్నా.. ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తి.. సమీకరణాల్ని లెక్కేసుకొని తను టికెట్ తీసుకొని ఎమ్మెల్యే అయిపోయాడు. అదే సమయంలో తనకు టికెట్ కేటాయించిన అధినేతను ఓడించాడని చెబుతారు. చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉండే వారిలోనూ చిరు గెలుపు తమకు ప్రాణవాయువుతో సమానమని ఫీల్ కాకపోవటమే అసలు సమస్య. సాధారణంగా అధినేతలు తక్కువగా నమ్మటం.. వారి ఫాలోయర్స్ ఎక్కువగా నమ్మటం ఉంటుంది. మెగా కాంపౌండ్ విషయంలో ఇది రివర్సు. వారు తమను అభిమానిస్తామని చెప్పే వారిని ఎక్కువగా నమ్మటం.. వారి మీద ఎక్కువగా ఆధారపడి.. తమ విచక్షణను మిస్ అవుతుంటారు. అదే వారి బలహీనతగా చెప్పాలి.

సాధారణంగా ఒకసారి తప్పు జరిగితే.. రెండోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మెగా కాంపౌండ్ అందుకు భిన్నం. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతారు. అందుకే వారికి ఎన్నికల్లో ఓటమి అన్నది ఒక అలవాటుగా మారిపోతోంది. కొన్ని అలవాట్లు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని మెగా కాంపౌండ్ ఎప్పటికి తెలుసుకుంటుందో?