Begin typing your search above and press return to search.

జగన్ మార్క్.. సిం'ఫుల్' గా అలా తీసి పెట్టాలి!

By:  Tupaki Desk   |   24 Nov 2022 8:30 AM GMT
జగన్ మార్క్.. సింఫుల్ గా అలా తీసి పెట్టాలి!
X
జగన్మోహన్ రెడ్డా మజాకానా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి? అంతిమంగా తాను కోరుకునే అధికారాన్ని తనతో ఉంచుకోవటం కోసం ఎలాంటి నిర్ణయాన్ని అయినా సాహసోపేతంగా తీసుకునే సత్తా ఆయన సొంతం. చాలా తక్కువ మంది అధినేతల్లోనే ఇలాంటి తీరు కనిపిస్తూ ఉంటుంది. ఎవరిదాకానో ఎందుకు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే.. తనకు సన్నిహితమైన వారిని కదపటానికి అస్సలు ఇష్టపడరు. వారి వల్ల నష్టం జరుగుతుందంటే.. ఆ నస్టాన్నితగ్గించటానికి ఏమైనా చేద్దాం కానీ తనకు నమ్మకస్తులైన వారిని కదిలించేందుకు ఇష్టపడరు.

కానీ.. జగన్మోహన్ రెడ్డి అందుకు పూర్తి విరుద్ధం. ఆ విషయాన్ని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే రెండున్నరేళ్లు పూర్తి కాగానే..మంత్రుల్నిమార్చేస్తానని చెప్పటం.. అందుకు తగ్గట్లే చేతల్లో చేసి చూపటం తెలిసిందే. అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. తాజాగా ఎనిమిది జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల్ని మార్చటమే కాదు.. పార్టీ సమన్వయ బాధ్యతల్ని సైతం కొత్త వారి చేతుల్లో పెట్టటం చూస్తే.. తాను అనుకున్నది అనుకున్నట్లు చేయటానికి దేనికైనా సిద్ధమన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పాలి.

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పక్కాగా చేయాలని.. లేనిపక్షంలో పీఠాలు కదులుతాయన్న జగన్.. అన్నట్లే తాజాగా అందుకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా చేసినట్లుగా చెబుతున్న మార్పుల్ని చూస్తే.. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షుల్ని మార్చినట్లుగా చెబుతున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మాజీ మంత్రులు కొడాలి నాని.. అనిల్ కుమార్ లను వారికి అప్పజెప్పిన బాధ్యతల నుంచి తప్పించారు.

విచిత్రమైన విషయం ఏమంటే.. సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై గతంలో అసహనం వ్యక్తం చేసిన జగన్.. తాజాగా ఆయన్ను మాత్రం తప్పించకపోవటం గమనార్హం. సజ్జల.. బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు.. నంద్యాల జిల్లాల బాధ్యతను ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డికి ఇచ్చారు. అనిల్ వద్ద ఉన్న వైఎస్సార్ కడప జిల్లాతో పాటు తిరుపతిజిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేనికి అప్పజెప్పారు. బాలినేనికి ఇప్పటికే చేతిలో ఉన్న వాటిని యథాతధంగా కొనసాగిస్తున్నారు.

బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తాన్ రావుకు ఇవ్వగా.. కొడాలి నాని వద్ద ఉన్న పల్నాడు బాధ్యతను భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. గుంటూరు జిల్లా బాధ్యతను మర్రి రాజశేఖర్ కు ఇచ్చారు. ఇప్పటికే ఆయన క్రిష్ణా.. ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు జిల్లాల్ని మర్రితో పాటు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డికి అప్పజెప్పారు. ఇక ఏ మాత్రం మార్పులు చోటు చేసుకోనిది మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిలకు మాత్రమే. విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స నుంచి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మార్చారు. వైవీ చేతిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు కేటాయించారు.

ఇక.. జిల్లా అధ్యక్షులుగా మార్పులు చోటు చేసుకున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాను పరీక్షిత్ రాజుకు.. విశాఖపట్నం జిల్లా బాధ్యతల్ని పంచకర్ల రమేశ్ కు.. గుంటూరు జిల్లాబాధ్యతల్ని డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఇచ్చారు. ప్రకాశం జిల్లా బాధ్యతల్నిజంకె వెంకటరెడ్డికి.. కర్నూలు బీవై రామయ్యకు అప్పజెప్పారు. అనంతపురం పైలా నరసింహయ్యకు.. చిత్తూరు డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామికి.. తిరుపతి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పజెప్పారు. మొత్తంగా పలువురు స్థానాల్ని కదిలించినట్లుగా కనిపిస్తున్నా.. పార్టీ వర్గాల వాదన ప్రకారం మాత్రం జగన్ తన తాజా నిర్ణయంతో భారీగా కుదిపేశారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.