Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఫీలయ్యే మాట.. మరోసారి కేసీఆర్ మనమడి టాపిక్

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:33 AM GMT
కేటీఆర్ ఫీలయ్యే మాట.. మరోసారి కేసీఆర్ మనమడి టాపిక్
X
రాజకీయాలు ఎంత కర్కసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైకి సుద్దలు చెబుతున్నా.. రాజకీయ అవసరం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే తీరు రాజకీయాల్లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. చిన్నా.. పెద్దా లేకుండా రాజకీయ చురకలు ఒక్కోసారి అనూహ్యంగా మారుతుంటాయి.తాజాగా అలాంటి మాటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేత బండి సంజయ్ నోటి నుంచి వచ్చింది. నిరుద్యోగుల కష్టాల్ని తెలుసుకునేందుకు హైదరాబాద్ లోని సెంట్రల్ లైబ్రరీకి చేరిన ఆయన.. అక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో కలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మనమడి ప్రస్తావన వచ్చింది.

రాజకీయ విమర్శల విషయంలో కఠినంగా వ్యవహరించే నేతల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. తాము టార్గెట్ చేసిన వారి విషయంలో ఎలాంటి మొహమాటానికి గురి కాకుండా.. వారిని రాజకీయంగా బలహీనం అయ్యేలా వ్యాఖ్యలు చేస్తుంటారు. కేసీఆర్.. కేటీఆర్ ను బాగా చదివేసిన పలువురు నేతలు.. ఈ మధ్య కాలంలో వారి మాదిరి దూకుడు వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ముద్దుల మనమడి మీద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. బొద్దుగా ఉండే ఆ కుర్రాడ్ని ఉద్దేశించి.. అతడి బొద్దుతనాన్ని వేలెత్తి చూపిస్తూ వ్యాఖ్యలు చేయటం..దీనికి ఆయన తండ్రి కమ్ మంత్రి కేటీఆర్ హర్ట్ కావటం.. ఆవేదనతో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఆ తర్వాత నుంచి కేసీఆర్ మనమడి ప్రస్తావనను ఎవరూ పెద్దగా తీసుకురాని పరిస్థితి నెలకొంది. ఆ లోటును తీరుస్తూ తాజాగా మరోసారి బండి సంజయ్ తన నోటికి పని చెప్పారు. నిరుద్యోగుల కష్టాల్ని విని చలించిపోయిన ఆయన.. కాసింత ఘాటుగా రియాక్టు అయ్యారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇస్తామని.. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.3016 చొప్పున ఇస్తామని హామీ ఇవ్వటం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎవరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి.. ఇప్పుడేమో ఇది సాధ్యమా? అని అంటున్నారని.. మరి ఇటీవలి ఎన్నికల వేళలోనూ ఉద్యోగాలపై ఏం మాటిచ్చావో దాని పౌనే నిలబడమంటున్నామన్నారు.

రాష్ట్రంలోని నిరుద్యోగుల్ని రప్పించి.. ఈ నెల 16న హైదరాబాద్ లో లక్షలాది మందితో మిలియన్ మార్చ్ నిర్వహించి తీరుతామని.. ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్.. గడీల నుంచి బయటకు వచ్చేలా చేస్తామంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మనమడు.. కేటీఆర్ కొడుకు హిమాన్షు ప్రస్తావన తీసుకొచ్చారు.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదని.. కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయంటూ మండిపడ్డారు. నెలకు రూ.16 లక్షలు జీతంగా తీసుకుంటున్నారని బండి చురకలు అంటించారు. ముఖ్యమంత్రి మనమడు కూడా ఉద్యోగానికి సిద్ధమైండని.. బయట మాత్రం ఒక్కరికి కూడా ఉద్యోగమివ్వలేదన్నారు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు.. ఇంట్లో వారి మీదా.. చిన్న పిల్లాడి మీదా విమర్శలు చేయటం.. అతడి ప్రస్తావన తెచ్చి రాజకీయ దాడి చేయటం సరికాదంటూ చెప్పే మంత్రి కేటీఆర్ మరోసారి ఫీల్ అయ్యేలా బండి మాట్లాడారని చెప్పక తప్పదు