Begin typing your search above and press return to search.

మ‌రోసారి సొంత పార్టీ నేత‌ల‌పైనే మంత్రి రోజా ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   23 July 2022 6:16 AM GMT
మ‌రోసారి సొంత పార్టీ నేత‌ల‌పైనే మంత్రి రోజా ఫిర్యాదు!
X
చిత్తూరు జిల్లా న‌గ‌రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ప‌ర్యాట‌క‌, క్రీడా శాఖ మంత్రి రోజాకు అస‌మ్మ‌తి సెగ ఎదుర‌వుతూనే ఉంది. ముఖ్యంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీలో కీల‌కంగా ఉన్న రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి, మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ కేజే కుమార్, ఆయ‌న భార్య‌ కేజే శాంతి, అమ్ములు త‌దిత‌రుల‌తో రోజాకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. అయినా స‌రే మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అండ‌తో రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డి శ్రీశైలం దేవ‌స్థానం చైర్మ‌న్ గా, కేజే శాంతి ఈడిగ‌ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌లుమార్లు రోజా వీరిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. త‌న‌కు వ్య‌తిరేకంగా గ్రూపులు క‌డుతున్నార‌ని సీఎం జ‌గ‌న్ దృష్టికి కూడా తెచ్చారు. అయితే అస‌మ్మ‌తి నేత‌ల‌కు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అండ ఉంద‌ని.. అందుకే వారిని జ‌గ‌న్ ఏమీ అన‌లేక‌పోతున్నార‌ని చెప్పుకుంటున్నారు.

కాగా ఈసారి రోజా సొంత పార్టీ నేత‌ల‌పై చిత్తూరు క‌లెక్ట‌రుకు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇందుకు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం పుత్తూరు మండ‌లం ఈస‌లాపురం ప‌రిధిలో ఉన్న‌ కొత్త క్వారీల అంశం కార‌ణ‌మైంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

స్థానిక ఎమ్మెల్యే అయిన త‌న‌కు తెలియ‌కుండా కొత్త క్వారీల‌కు ఎలా శ్రీ‌కారం చుడ‌తార‌ని ఆర్కే రోజా పార్టీ నేత‌ల‌పై మండిప‌డ్డ‌ట్టు స‌మాచారం. ఈసలాపురం రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 6లో 750 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూములున్నాయి. ఇందులో నాలుగు క్వారీలుండ‌గా.. మ‌రో ఐదు క్వారీల ఏర్పాటుకు ద‌ర‌ఖాస్తులు వెళ్లాయ‌ని చెబుతున్నారు. మొత్తం పదెకరాలకు ఒక క్వారీ ఇవ్వాల‌నేది ప్ర‌తిపాద‌న అని అంటున్నారు. అయితే ఇదంతా గుట్టుగా జ‌రుగుతోంద‌ని పేర్కొంటున్నారు. ఈ క్వారీల‌న్నీ రోజా వ్య‌తిరేక వ‌ర్గం నాయ‌కులు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ అస‌మ్మ‌తి నాయ‌కుల‌కు చిత్తూరు జిల్లాలో ఓ సీనియ‌ర్ మంత్రి అండ‌దండలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో రోజా వ‌ర్గానికి చెందిన పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు ఇప్ప‌టికే కొత్త క్వారీల ఏర్పాటును వ్య‌తిరేకించారు. ఈ మేర‌కు మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించి త‌మ వ్య‌తిరేక‌త‌ను బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు మంత్రి రోజా కూడా క్వారీల విష‌య‌మై నేరుగా తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా కొత్త క్వారీలను ఎలా ఏర్పాటు చేస్తార‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. ఈసలాపురం గ్రామాన్ని పుత్తూరు మున్సిపాలిటీలో క‌లిపార‌ని, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి అధికారులు మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాయకుండా ఈసలాపురం పంచాయతీ కార్యదర్శి పేరిట ఎలా రాస్తారని క‌లెక్ట‌ర్‌ను రోజా నిల‌దీసిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ క్వారీల వ్య‌వ‌హారం ఏ మ‌లుపు తీసుకుంటో వేచిచూడాల్సిందేన‌ని అంటున్నారు.