Begin typing your search above and press return to search.

మరోసారి చిక్కుల్లో రవిప్రకాశ్.. ఇంట్లో సోదాలు.. అదుపులో అతడు

By:  Tupaki Desk   |   21 March 2020 3:56 AM GMT
మరోసారి చిక్కుల్లో రవిప్రకాశ్.. ఇంట్లో సోదాలు.. అదుపులో అతడు
X
తెలుగు మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ తో ఒక వెలుగు వెలిగిపోయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు ఒకటి తర్వాత ఒకటిగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో సోదాల్ని నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లోని బీఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేశ్ గుప్తా ఉన్నట్లుగా గుర్తించారని చెబుతున్నారు.

సుకేశ్ గుప్తా ఎందుకు రవిప్రకాశ్ ఇంట్లో తలదాచుకున్నాడు? అతడేం చేశాడు? అతని కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? అంటే.. మరో బడా ఆర్థిక అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లాలి. ఎస్ఆర్ఈఐ సంస్థ నుంచి సుకేశ్ గుప్తా.. నీతూ గుప్తాతోపాటు.. నిహారిక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన ఇద్దరు కలిసి రూ.110 కోట్ల మొత్తాన్ని రుణంగా తసీుకున్నారు. ఈ డీల్ 2018 జూన్ లో జరిగింది.

ఈ భారీ మొత్తానికి సంబంధించిన వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించాలని.. నాలుగు వాయిదాల్లో రుణం.. వడ్డీ మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి ష్యురిటీ లేకుండా ఇవ్వరు కదా. అందుకు తగ్గట్లే.. హఫీజ్ పేటలో తనకున్న ఎనిమిది ఎకరాల స్థలాన్ని.. కింగ్ కోఠిలో ఉన్న 28,106 గజాల నజ్రీబాగ్ ప్యాలెస్ చూపించి డీల్ ఓకే చేసుకున్నారు.

అంతా అనుకున్నట్లే జరిగినా.. డీల్ లో భాగంగా డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చేసరికి సుకేశ్ అండ్ కో ఫెయిల్ అయ్యింది. దీంతో.. గత డిసెంబరులో హఫీజ్ పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్ఆర్ఈఐ సంస్థ రూ.102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు వీలుగా.. తమకు తనఖా పెట్టిన ప్యాలెస్ ను అమ్మాలని నిర్ణయించారు. అయితే.. అనూహ్యంగా ఆ ప్యాలెస్ ను అప్పటికే ఐరిస్ హాస్పిటాలిటీస్ సంస్థకు అమ్మేసినట్లు గుర్తించారు. తమను మోసం చేసిన వైనం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో.. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా.. వీరు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించారు. పక్కా సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. తాజాగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి..సుకేశ్ అండ్ కోను అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి మరో ఆర్థిక వివాదానికి సంబంధించిన ఇష్యూలో రవిప్రకాశ్ లింక్ కావటం.. ఆయన ఇల్లు నిందితులకు అడ్డాగా మారటం గమనార్హం. మరి.. దీని పై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో?