Begin typing your search above and press return to search.

మరోసారి కరోనా పంజా.. 21 వేల మార్కు క్రాస్

By:  Tupaki Desk   |   3 Jun 2022 8:32 AM GMT
మరోసారి కరోనా పంజా..  21 వేల మార్కు క్రాస్
X
భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు రెండు వేలకే పరిమితమైన కేసులు ఇవాళ నాలుగు వేలు దాటాయి. ప్రజలు, వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కాకపోతే మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.

దేశంలో కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. నిన్నటి వరకు కేవలం రెండు వేలకే పరిమితమైన కేసులు ఇవాళ నాలుగు వేలు దాటాయి. కరోనా నిబంధనలు, ఆంక్షలు సడలించడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు.. త్వరగా అప్రమత్తమవ్వకపోతే మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ వెంటనే అప్రమత్తమై.. కొవిడ్ నిబంధనలు అమలు కచ్చితం చేయకపోతే మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదముందని చెబుతున్నారు.

ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర లో కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. కొత్త కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 21వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 4.25 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

వీరిలో 4వేల 41 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 84 రోజుల తర్వాత అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం మరోసారి ఆందోళన కలిగిస్తోందని వైద్యులు అంటున్నారు. మరోవైపు కొవిడ్ పాజిటివిటీ రేటు ఒక శాతానికి పెరిగిందని తెలిపారు.

కేరళలో 1,370, మహారాష్ట్రలో 1,045 మంది మహమ్మారి బారిన పడ్డారు. అప్రమత్తమైన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పక పాటించాలని అల్టిమేటమ్ జారీ చేశాయి. నిర్లక్ష్యం వహిస్తే ఆంక్షలు విధించిక తప్పదని హెచ్చరించాయి.

గురువారం 19వేలకు పైగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య ఒక్కసారిగా శుక్రవారానికి 1,177(0.05 శాతం) ఎగబాకింది. 24 గంటల వ్యవధిలో 2,363 మంది కోలుకోగా.. 10 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం కేసులు 4.31 కోట్లకు పైగా ఉండగా.. అందులో రికవరీల వాటా 98.74 శాతంగా కొనసాగుతోంది. నిన్న 12.05 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటి వరకూ 193 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.