Begin typing your search above and press return to search.

కరోనా నుంచి బయటపడ్డా... ఆ మూడు సమస్యలు వేధిస్తూనే ఉన్నాయ్..

By:  Tupaki Desk   |   4 May 2021 5:00 AM IST
కరోనా నుంచి బయటపడ్డా... ఆ మూడు సమస్యలు వేధిస్తూనే ఉన్నాయ్..
X
గత ఏడాదితో పోలిస్తే ఈసారి కరోనా వ్యాప్తి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రెట్లు పెరిగింది. వైరస్ కూడా గతంతో పోలిస్తే ప్రమాదకరంగా మారింది. పాజిటివ్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ ఏడాది వైరస్ బారిన పడిన వారి మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. కొంతమంది కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నప్పటికీ మూడు రకాల సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఇలా ఉండటాన్ని 'లాంగ్ కోవిడ్' గా పిలుస్తారు. లాంగ్ కోవిడ్ ఎంతో ప్రమాదకరం. దీనివల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతిని మనిషి దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కరోనా వైరస్ బారిన పడ్డ వారికి శ్వాసకు సంబంధించిన సమస్యలు సాధారణంగా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం వైరస్ బారినపడి కోలుకున్న వారికి శ్వాస తీసుకోవడంలో సమస్య, చాతిలో నొప్పి, బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ లాంగ్ కోవిడ్ వల్ల తలెత్తే సమస్యలు. లాంగ్ కోవిడ్ వల్ల శరీరంలోని ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు మెదడు వంటి అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

లాంగ్ కోవిడ్ వల్ల తరచూ శ్వాసకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కరోనా నుంచి కోలుకున్న ప్పటికీ ఈ సమస్య మాత్రం వేధిస్తోంది. ప్రస్తుతం లాంగ్ కోవిడ్ బారిన పడ్డవారు సరిగ్గా శ్వాస తీసుకోలేక పోతున్నారని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తుల పై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ఛాతిలో నొప్పి కూడా దీర్ఘకాలికంగా ఉంటే దీనిని కూడా లాంగ్ కోవిడ్ గా భావించొచ్చు. ఈ సమస్య ఉన్న వాళ్లకు చాతిలో అసౌకర్యంగా ఉంటుంది. తరచూ అక్కడ నొప్పి వస్తుంటుంది.

లాంగ్ కోవిడ్ వల్ల తలెత్తే మరో సమస్య బ్రెయిన్ ఫాగ్. ఇటువంటి వారికి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తరచూ మత్తుగా ఉంటుంది. మనసు కూడా స్థిమితంగా ఉండదు. ఏదోలా విధంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

లాంగ్ కోవిడ్ వల్ల వీరికే ఎక్కువ నష్టం

లాంగ్ కోవిడ్ బారిన పడ్డ వారిలో ముఖ్యంగా కొంత మందికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తలెత్తే సమస్యలు అందరికీ ఒకేలా ఉండవు. వృద్ధులు, స్థూలకాయం ఉన్న వాళ్ళు, మహిళలు లాంగ్ కోవిడ్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ కొలిన్స్ తెలిపారు.