Begin typing your search above and press return to search.

ఒక‌ప్ప‌డు ప్ర‌పంచంలోనే శ‌క్తివంత‌మైన మ‌హిళ‌.. ఇప్పుడు ఈడీ ముందుకు!

By:  Tupaki Desk   |   20 July 2022 11:47 AM GMT
ఒక‌ప్ప‌డు ప్ర‌పంచంలోనే శ‌క్తివంత‌మైన మ‌హిళ‌.. ఇప్పుడు ఈడీ ముందుకు!
X
నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జూలై 21న ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజరుకానున్నారు. వాస్తవానికి జూన్ 8నే సోనియా గాంధీ విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల్సి ఉండ‌గా ఆమెకు క‌రోనా సోక‌డంతో విచార‌ణ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. విచార‌ణ‌కు హాజ‌రుకాలేదంటూ సోనియాగాంధీకి తాజాగా సమన్లు జారీ చేయ‌డంతో జూలై 21న గురువారం విచార‌ణ‌కు రావాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్నారు.

కాగా సోనియా గాంధీ తనయుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీని జూన్ నెల‌లో పలుమార్లు ఈడీ విచారించింది. ఐదు రోజుల‌పాటు ఏకంగా 55 గంట‌లు ప్ర‌శ్నించింది. ఇప్పుడు సోనియాగాంధీని ఎన్నిరోజులు ప్ర‌శ్నిస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఇప్ప‌టికే రాహుల్ గాంధీని అన్ని గంట‌లు ఏక‌ధాటిగా విచారించ‌డంపై కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్త ఆందోళ‌న నిర్వ‌హించింది. ఇప్పుడు సోనియా గాంధీని కూడా విచార‌ణ‌కు పిల‌వ‌డంతో జూలై 21న దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌నున్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్ర‌హం నుంచి ఈడీ కార్యాల‌యం వ‌ర‌కు నిర్వ‌హించే ర్యాలీలో పార్టీ సీనియ‌ర్ నేత‌లంతా పాల్గొన‌బోతున్నార‌ని స‌మాచారం.

ఇక నేషనల్ హెరాల్డ్ కేసు పూర్వాపరాల్లోకి వస్తే.. నేషనల్ హెరాల్డ్ పత్రికను దివంగత భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో స్థాపించారు. ఇందులో నెహ్రూతో పాటు 5000 మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. ఈ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) ఆధ్వర్యంలో నడిచేది. నష్టాల కారణంగా 2008లో పత్రిక మూతపడింది. పత్రిక మూతపడే నాటికి ఇందులో వాటాదారుల సంఖ్య 1000కి తగ్గింది.

మూతపడిన నేషనల్ హెరాల్డ్ ప్రతికను తిరిగి ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది. అయినప్పటికీ ఆ పత్రిక ప్రారంభం కాలేదు. పైగా ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ.90 కోట్లు బకాయి పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆ రూ.90 కోట్లు అప్పు సోనియా, రాహుల్‌లకు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)‌కు బదలాయించింది. అంత అప్పు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఏజెఎల్ అప్పులకు బదులు సంస్థ వాటాలన్నింటినీ వైఐఎల్‌కు బదలాయించింది. ఇందుకు గాను వైఐఎల్ సంస్థ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించింది.

అలా ఏజెఎల్ వాటా మొత్తాన్ని సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన వైఐఎల్‌కు బదలాయించడం ద్వారా ఆ సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా వైఐఎల్ సొంతమయ్యాయి. ఏజెఎల్‌లో మిగతా వాటాదారులను విస్మరించి ఏకపక్షంగా ఈ వ్యవహారం జరగడం... కేవలం రూ.90 కోట్ల అప్పుకు సంస్థ ఆస్తులన్నీ బదలాయించడం.. ఇదంతా చట్ట విరుద్దంగా జరిగిన వ్యవహారమనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

దీనిపై 2012లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏజెఎల్-వైఐఎల్ మధ్య జరిగిన వ్యవహారంలో సోనియా, రాహుల్‌లు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు, ఓ రాజకీయ పార్టీ పబ్లికేషన్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోనియాగాంధీ, రాహుల్‌ల‌ను విచారిస్తోంది.