Begin typing your search above and press return to search.

హైదరాబాద్ నగర గులాబీ ఆఫీసు కోసం ఏకంగా ఎకరం భూమి!

By:  Tupaki Desk   |   12 May 2022 2:30 AM GMT
హైదరాబాద్ నగర గులాబీ ఆఫీసు కోసం ఏకంగా ఎకరం భూమి!
X
తిరుగులేని అధికారం చేతిలో ఉన్నప్పుడు.. తోచినట్లు చేసే వారికి కొదవ ఉండదు. కలలాంటి తెలంగాణను సాకారం చేసిన టీఆర్ఎస్ అధినేత.. గులాబీ బాస్ కు ఉండే కాన్ఫిడెన్స్ ఎంతన్నది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికే తమ ఫాం హౌస్ విషయంలో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పేయలేక.. అది ఫార్మర్ హౌస్ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో స్పష్టం చేయటం తెలిసిందే.

ఆయన అధికార నివాసంగా ఏర్పాటు చేసిన భూమి ఏకంగా 9 ఎకరాలుగా చెబుతారు. ఇక.. పార్టీ ప్రధాన కార్యాలయం ఎంత విశాలంగా.. మరెంత ఖరీదైన ప్రాంతమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవి కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ భారీ ఎత్తున గులాబీ పార్టీ ఆఫీసులకు స్థలాల్ని కేటాయించి.. భారీ భవంతుల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే.

ఇప్పుడున్నవి సరిపోనట్లుగా తాజాగా హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పే బంజారాహిల్స్ 12లో దాదాపుగా ఎకరానికి పైనే భూమిని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారాన్ని చూస్తే.. ఎకరానికి కాస్త తక్కువ (ఎకరం అంటే 4840 గజాలు కాగా.. ప్రస్తుతం టీఆర్ఎస్ హైదరాబాద్ పార్టీ కార్యాలయం కోసం 4539 గజాలు)గా భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ లోనే సువిశాలంగా ఉండటం తెలిసిందే. ఇలా.. ఒకే ప్రాంతంలో పార్టీ ప్రధాన కార్యాలయం.. దానికి కాస్తంత దూరంలోనే హైదరాబాద్ మహానగర పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయటంపై విస్మయం వ్యక్తమవుతోంది. అయితే.. ఇంత భారీ భూమిని ఏ ధరకు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా కేసీఆర్ సర్కారు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలం విలువ దగ్గర దగ్గర రూ.100 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇంత భారీగా విలువ చేసే స్థలాన్ని టీఆర్ఎస్ కు ఎంతకు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఏమైనా.. గులాబీ పార్టీ నగర కార్యాలయం కోసం ఇంత భారీగా భూమిని కేటాయించటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరి దీనికి గులాబీ పార్టీ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి. ఇదంతా చూస్తే.. బంగారు తెలంగాణ కోసం పని చేసే కేసీఆర్ సిటీ పార్టీ ఆఫీసు కోసం ఆ మాత్రం కేటాయింపులు చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి?