Begin typing your search above and press return to search.

ఒక్క అరటిపండు.. చిన్న టేపు.. రూ.85లక్షలకు అమ్మేశారు

By:  Tupaki Desk   |   7 Dec 2019 6:17 AM GMT
ఒక్క అరటిపండు.. చిన్న టేపు.. రూ.85లక్షలకు అమ్మేశారు
X
వినేటోడు ఉంటే చెప్పేటోడు చెలరేగిపోతారన్నది ఎంత నిజమో.. కొనేటోడు ఉండాలే కానీ ఇంటికి పట్టిన బూజును సైతం ‘‘ఆకాశ ధూళి’’ అని అమ్మే వీలుంటుంది. తాజా ఉదంతం వింటే ఇదెంత నిజమో ఇట్టే అర్థమైపోతుంది. దీని కంటే ముందు మీకీ మధ్య విడుదలైన నాగార్జున సినిమా గుర్తుందా? తమిళ నటుడు కార్తీ నటించిన ఈ చిత్రంలో ఇష్టారాజ్యంగా వేసిన పెయింట్ ను ఒక అద్భుత కళాఖండంగా ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ కు అమ్మటం.. దానికి భారీ ధర రావటం.. అది చూసి కార్తీ క్యారెక్టర్ షాక్ తిన్న వైనం సినిమాలో చూసినప్పుడు హాయిగా నవ్వుకుంటాం.

ఇంచుమించు ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అయ్యింది.కాకుంటే దానికి పలికిన ధర గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. అమెరికాకు చెందిన ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ ఒక కళాఖండాన్ని తయారు చేశారు. అరటిపండును టేపు సాయతో గోడకు అంటించారు. కిందన పుస్తకాల్ని తోచినట్లుగా పెట్టేశాడు. అమెరికాలోని మియామీ బీచ్ లో ఆర్ట్ బసెల్ పేరుతో ప్రదర్శనకు ఉంచారు.

ఊహించని రీతిలో కమెడియన్ పేరుతో ఉంచిన ఈ ఆర్ట్ ను ఏకంగా రూ.85లక్షలకు అమ్ముడు కావటం సంచలనంగా మారింది. మియామీలోని ఒక షాపులో కొన్న చిన్న అరటిపండు.. దాన్ని అంటించేందుకు చిన్న టేపు ముక్కతో చేసిన కళాఖండానికి ఇంత భారీగా రేటు పలకటంతో అందరూ అవాక్కు అవుతున్నారు. ఏమైనా.. కొనే పిచ్చ ఉండాలే కానీ.. ఏ బుర్రలో ఎలాంటి భావన కలుగుతుందో తెలుస్తుంది చెప్పండి. జేబులు టైట్ అయిపోయేంత డబ్బులు ఉన్నప్పడు ఇలాంటి ఐడియాలు అలా వర్క్ వుట్ అవుతూ సంచలన వార్తలుగా మారిపోతాయంతే.