Begin typing your search above and press return to search.

దిశ ఘటనకు ఒక్కరోజు ముందు భాగ్యనగరిలో దుర్మార్గం

By:  Tupaki Desk   |   17 Dec 2019 5:34 AM GMT
దిశ ఘటనకు ఒక్కరోజు ముందు భాగ్యనగరిలో దుర్మార్గం
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఉదంతానికి ఒక్కరోజు ముందు హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక దారుణం తాజాగా బయటకు వచ్చింది. పాతబస్తీకి చెందిన ఒక మానసిక వికలాంగురాలిపై ఇద్దరు ఆటోడ్రైవర్లు.. ఒక బ్యాండ్ మెన్ చేసిన పని అయ్యో అనిపించేలా మారింది. తనకు జరిగిన అన్యాయం మీద బాధిత మహిళ సరిగా చెప్పలేకపోవటంతో స్థానికులు.. సీసీ కెమేరాల సాయంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇంతకీ సదరు యువతిపై జరిగిన దారుణం ఏమిటన్నది చూస్తే..

కుల్సుంపురా పరిధిలో పందొమ్మిదేళ్ల యువతి తన తల్లి.. సోదరులతో కలిసి ఉంటోంది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవటంతో తరచూ బయటకు వెళుతూ ఉండేది. అలా వెళ్లినప్పుడల్లా ఆమెను వెతికి ఇంటికి తీసుకొచ్చేవారు. దిశ ఉదంతం జరగటానికి ఒక రోజు ముందు ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. పురానాపూల్ చౌరస్తా వద్ద ఆమె నిలబడి ఉంటే.. ఇద్దరు ఆటో డ్రైవర్లు (ఖలీమ్, అజీజ్) ఆమెపై కన్నేసి.. ఇంట్లో దిగబెడతామని చెప్పి మూసీ ఒడ్డుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

తర్వాత ఆమెను జుమ్మెరాత్ బజార్ వద్ద దించేసి నజీర్ అనే 46 ఏళ్ల బ్యాండ్ మెన్ కు అప్పజెప్పారు. ఆమెను చూడగానే అతడికి దుర్మార్గపు ఆలోచనలు వచ్చి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాధితురాలి కోసం వెతుకుతున్న ఆమె సోదరులకు ఆమె కనిపించింది. సైగలతో తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె చెప్పింది. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ కు ఆమెను తీసుకెళ్లిన సోదరులు.. ఆమెను భరోసా సెంటర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తించారు.

ఆధారాలు లభించకపోవటంతో.. సాంకేతికత ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేశారు. సీసీ కెమేరా ఫుటేజ్ సాయంతో ఆమె నిలబడి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అనంతరం బ్యాండ్ మ్యాన్ నజీర్ ను గుర్తించారు. అనంతరం ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.