Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ కు తీవ్ర జ్వ‌రం.. ఆగిన పాద‌యాత్ర‌

By:  Tupaki Desk   |   31 May 2018 6:34 AM GMT
జ‌గ‌న్ కు తీవ్ర జ్వ‌రం.. ఆగిన పాద‌యాత్ర‌
X
త‌న‌కు ఏమ‌వుతుందోన‌న్నది ప‌ట్టించుకోకుండా అనుకున్న‌ది సాధించే వ‌ర‌కూ వెన‌క‌డుగు వేయ‌ని మొండిత‌నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంతం. గ‌డిచిన ఆరు నెల‌లుగా పాద‌యాత్ర చేస్తున్న ఆయ‌న‌.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్నారు.

మండుతున్న ఎండ‌ల కార‌ణంగా.. వీధుల్లోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న ప‌రిస్థితుల్లో.. వేలాది కిలోమీట‌ర్లు అదే ప‌నిగా న‌డ‌వ‌టం.. నాన్ స్టాప్ గా ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ పాద‌యాత్ర చేయ‌టం అంత తేలికైన విష‌యం కాదు. ప్రజ‌లు చూపిస్తున్న అభిమానంతో ముంచుకొస్తున్న అల‌స‌ట‌ను ప‌క్క‌న పెట్టేసి మ‌రీ పాద‌యాత్ర‌ను సాగిస్తున్న జ‌గ‌న్ తాజాగా అనారోగ్యానికి గుర‌య్యారు.

ఆయ‌న విప‌రీత‌మైన జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గ‌డిచిన ఆర్నెల్లుగా పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో పెరిగిన ఎండ తీవ్ర‌త‌తో తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. అయిన‌ప్ప‌టికి ప‌ట్టించుకోకుండా పాద‌యాత్ర చేస్తున్న ఆయ‌న‌కు మంగ‌ళ‌వారం వ‌డ‌దెబ్బ కొట్టింది. జ్వ‌రంతో పాటు జ‌లుబు.. త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న జ‌గ‌న్ ను వైద్యులు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు.

దీంతో.. త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చిన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం స‌మీపంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించి.. ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకునేందుకు జ‌గ‌న్ పార్టీ నేత‌లు క్యూ క‌ట్టారు. మ‌రోవైపు ప్ర‌తి గురువారం ఆయ‌న హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. తాజాగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేని ప‌రిస్థితుల్లో ఈసారి కోర్టుకు హాజ‌రు కావ‌టంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.