Begin typing your search above and press return to search.

ఒక గౌడ్ ఇన్.. మరొక గౌడ్ ఔట్.. తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి..!

By:  Tupaki Desk   |   22 Oct 2022 11:30 AM GMT
ఒక గౌడ్ ఇన్.. మరొక గౌడ్ ఔట్.. తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి..!
X
మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు మహారంజుగా సాగుతున్నాయి. ఊసరవెల్లులు రంగులు మార్చిన విధంగా నేతలు కూడా క్షణాల్లో పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పార్టీల సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ పక్కకు పోయాయి. కేవలం డబ్బు, పదవులు ఆధారంగా నడుస్తున్నాయి. దీనికి నిదర్శనంగా తాజా పరిణామాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని.. అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. బయటకి వెళ్లాలనుకునే వారు ఇంతకుమించి ఇంకేమి చెబుతారని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఆయన బీజేపీలో చేరి ఆరు నెలలు కూడా కాలేదు.. అప్పుడే ఆ పార్టీలో బోర్ కొట్టినట్లు ఉంది.

అయితే.. దీని వెనుక అధికార పార్టీ టీఆర్ఎస్ హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మునుగోడులో బీజేపీకి వస్తున్న ఆదరణను ఓర్వలేకే ఇతర నియోజకవర్గాల నేతలపై పడ్డారని ఆ పార్టీ నేతలు నిష్టూరమాడుతున్నారు.

మంత్రి కేటీఆరే ఆయనతో స్వయంగా సంప్రదింపులు జరిపి తిరిగి వెనక్కి వచ్చేలా చేశారని తెలుస్తోంది. అయితే..ఇక్కడే అసలైన ట్విస్టు నెలకొంది. భిక్షమయ్య గౌడ్ ఆలేరు నుంచి ఎమ్మెల్యే టికెట్ రాదనే భావించి బీజేపీలోకి వెళ్లారని.. మళ్లీ ఏ హామీతో వస్తున్నారని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

2009లో ఆలేరు నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో ఓడిపోయారు. తర్వాత గులాబి గూటికి చేరారు. అయితే.. నియోజకవర్గంలో తనను సునీత పట్టించుకోవడం లేదని.. తన ఎదుగుదలను అడ్డుకుంటోందని భావించిన ఆయన ఆరు నెలల క్రితం బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. పలువురి చేరికలతో పార్టీని బలోపేతం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అంతా ఆయనకేనని భావించారు. అలాంటిది ఏమైందో ఏమో ఉన్నట్లుండి రాజీనామా చేశారు.

అయితే ఆయన రాజీనామా వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరారు. భిక్షమయ్యకు, బూరకు గతంలో విభేదాలు ఉండేవి. ఇపుడు బూర నర్సయ్య గౌడ్ కూడా ఆలేరుపై కన్నేశారని.. బీజేపీలో మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో ఆయన ఆలేరు టికెట్ హామీతోనే చేరినట్లు తెలుస్తోంది. అందుకే భిక్షమయ్యగౌడ్ రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో బీజేపీలో ఒక గౌడ్ ఇన్.. మరొక గౌడ్ ఔట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.