Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌

By:  Tupaki Desk   |   6 May 2021 9:41 AM GMT
ఆ రాష్ట్రంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌
X
గోవా..ఒక్క మనదేశంలోనే కాదు విదేశీయులని సైతం ఆకర్షించే పర్యాటక ప్రదేశం. అయితే , తాజాగా గోవా కరోనా విజృంభణతో వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌ తేలడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడి ఆంక్షలు అమలు చేస్తోంది. గోవాలో ఏప్రిల్‌ నెలలో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. గత నెలలో అక్కడ పాజిటివిటీ 40 నుంచి 51శాతంగా ఉన్నట్లు అక్కడి కొవిడ్‌ నిర్వహణ అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా, ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు 48శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో దేశంలోనే గోవా అగ్రస్థానంలో ఉండగా.. 37శాతం పాజిటివిటీ రేటుతో హరియాణా రెండోస్థానంలో ఉంది.గోవాలో కొవిడ్‌ పరీక్షలు జరిపిన ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం చూస్తుంటే వైరస్‌ ఎంత విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతుందో స్పష్టంగా అర్థమవుతోందని ఆరోగ్యరంగ చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే పూర్తి లాక్‌ డౌన్‌ తో పాటు కొంతకాలం పర్యాటకులు రాకుండా నిషేధం విధించడమే ఏకైక మార్గమని అంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో భయంకర పరిస్థితులే ఉన్నప్పటికీ ఒక వినాశనం నుంచి తప్పించుకుందని గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే వెల్లడించారు. గోవాలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్నమాట వాస్తవమేనని.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన మెడికల్‌ ఆక్సిజన్‌, వైద్య పరికరాలను అందించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఈ మహమ్మారిని నియంత్రించడానికి కఠిన లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని అన్నారు. అయితే, రెవెన్యూను దృష్టిలో ఉంచుకొని వేల మంది పర్యాటకులను అనుమతించడం వల్లే రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని విపక్ష పార్టీలతో పాటు వైద్యరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, వైరస్‌ తీవ్రతను అదుపులోకి తెచ్చేందుకు ఏప్రిల్ 29నుంచి ఐదు రోజులపాటు గోవాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేశారు. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం లక్ష కేసులు నమోదుకాగా ప్రస్తుతం 26 వేల క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.కొంతకాలం పాటు గోవా రాష్ట్రానికి పర్యాటకులను నిషేధించి లాక్ డౌన్ విధిస్తేనే కంట్రోల్ అవుతుందని లేదంటే మహమ్మారి విజృంభణకు గోవా బలికావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.