Begin typing your search above and press return to search.

అక్కడ ఒక రాత్రి... సీఎం గా జగన్ తొలిసారి....

By:  Tupaki Desk   |   10 Nov 2022 9:31 AM GMT
అక్కడ ఒక రాత్రి... సీఎం గా జగన్ తొలిసారి....
X
జగన్ ముఖ్యమంత్రిగా పర్యటనలు చేస్తూంటారు కానీ ఆయన వచ్చిన పని చూసుకుని తిరిగి తాడేపల్లి వెళ్ళిపోతారు. ఇది మూడున్నరేళ్ళుగా జనాలు చూస్తున్నదే. గత చీఫ్ మినిస్టర్లకు భిన్నమైన స్టైల్ జగన్ ది. ఆయన ఏ జిల్లాకు వెళ్ళినా ఎంత పొద్దు పోయినా తిరిగి తాడేపల్లి కే చేరుకుంటారు. అదే చంద్రబాబు లాంటి వారు సీఎం గా ఉన్న రోజులలో జిల్లాల టూర్లకు వస్తే రెండు మూడు రోజులు కూడా బస చేసి అటు పార్టీ ఇటు ప్రభుత్వ వ్యవహారాలను కూడా చక్కబెట్టుకుని వెళ్ళేవారు.

విశాఖలో హుదూద్ సమయంలో చంద్రబాబు అయితే ఏకంగా వారం రోజుల పాటు విశాఖలోనే బస చేసి మొత్తం అంతా ఒక కొలిక్కి వచ్చాక కానీ అమరావతి వెళ్లలేదు. ఇక జగన్ టైం లో కూడా విశాఖలో ప్రమాదాలు కొన్ని జరిగాయి. అయినా జగన్ పరామర్శకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంలో సొంత పార్టీలోనూ అసంతృప్తి ఉంది.

నిజానికి ముఖ్యమంత్రులు జిల్లాలకు వచ్చినపుడు తమకు వీలు దొరుకుతుందని, వారిని కలవవచ్చు అని చాలా మంది నాయకులు ఆశిస్తారు. కానీ జగన్ విషయంలో ఆ వెసులుబాటు అయితే లేదు. కానీ తొలిసారి జగన్ మాత్రం విశాఖలో ఒక రోజు రాత్రి గడపబోతున్నారు. అది కూడా మోడీ పుణ్యం వల్ల అనే చెప్పాలి. నరేంద్ర మోడీ విశాఖలో రెండు రోజుల టూర్ పెట్టుకున్నారు. ఆయన ఈ నెల 11న రాత్రికి విశాఖ వస్తున్నారు.

దాంతో ఆయనకు స్వాగతం పలకడానికి జగన్ తాడేపల్లి నుంచి ఆ రోజు సాయంత్రం విశాఖ వస్తున్నారు. రాత్రికి మోడీ కూడా తూర్పు నావికాదళం అతిధి గృహంలో బస చేయనున్నారు. అలాగే జగన్ కూడా విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఆ విధంగా నైట్ హాల్ట్ జగన్ విశాఖలో చేయనున్నారు. సీఎం గా జగన్ ఈ విధంగా విశాఖలో నైట్ హాల్ట్ చేయడం ఇదే మొదటిసారి.

దాంతో మోడీ టూర్ కాదు కానీ ఈ విషయం కూడా ఇపుడు అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. జగన్ విశాఖను రాజధాని చేస్తామని అంటున్నారు. విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెడతామని అంటున్నారు. ఇదంతా మూడేళ్ళుగా సాగుతున్నా తాను ఎంతో ఇష్టపడిన విశాఖలో మాత్రం ఆయన ఎపుడూ పర్యటనకు వచ్చినా కొద్ది గంటలు మాత్రమే ఉండి వెళ్ళిపోతున్నారు.

ఈసారి అలా వీలు లేకుండా ప్రధాని కూడా విశాఖలోనే రాత్రి విడిది చేస్తున్నారు. ఇద్దరూ కలసి 12న విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజిలో జరిగే సభలో ప్రసంగాలు చేయనున్నారు. దాంతో మోడీతో పాటు జగన్ కూడా రాత్రికి విశాఖలో ఉండబోతున్నారు.

ఒక విధంగా చూస్తే ప్రధాని సీఎం విశాఖలో ఒక రాత్రి గడపడం కూడా రికార్డుగానే చూస్తున్నారు. ఇది ఎపుడూ జరగలేదు కూడా. మొత్తానికి చూస్తే నవంబర్ 11 రాత్రి విశాఖ చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే వైసీపీ నేతలు కూడా జగన్ విశాఖలో సూర్యోదయాన్ని చూస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖకు రాజధాని రావడం ఖాయమని జోస్యాలు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.