Begin typing your search above and press return to search.

ఒక ఉల్లిపాయ రూ.60.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   18 Dec 2019 10:43 AM GMT
ఒక ఉల్లిపాయ రూ.60.. ఎక్కడంటే?
X
అవును.. మీరు చదివింది కరెక్టే. ఒక్కటంటే ఒక్క ఉల్లిపాయ ఏకంగా రూ.60 పలికేస్తోంది. ఉల్లి ధర పెరిగి సామాన్యుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఎంతకూ తగ్గని ఉల్లి ధరతో వంటిల్లు ఘాటు తగ్గుతోంది. కేజీ రూ.200 వరకు వెళ్లిన ఉల్లి ధర ఇప్పుడు కేజీ రూ.120 నుంచి రూ.150 మధ్య నడుస్తోంది.

విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయట. తాజాగా ఛత్తీస్ గఢ్ కు చెందిన వ్యాపారులు పలువురు కలిసి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నుంచి భారీ ఎత్తున ఉల్లిని తెప్పించారట. 60 టన్నుల ఉల్లిని తెప్పించారు. భారీ ఎత్తున ఉల్లి విదేశాల నుంచి వచ్చిన నేపథ్యంలో ధర కాస్త తగ్గుతుందనుకుంటే.. తగ్గకపోగా కొత్తసమస్యలు మొదలయ్యాయట.

టర్కీ నుంచి వచ్చిన ఉల్లి కేజీకి రెండంటే రెండు మాత్రమే తూగుతున్నాయనట. ఒక్కొక్క ఉల్లి అరకేజీ నుంచి 600 గ్రాములు ఉంటుందట. మరికొన్ని అయితే.. అంతకంటే ఎక్కువే బరువుతో ఉన్న ఉల్లిపాయలు వచ్చాయట. దీంతో.. ఒక్క ఉల్లిపాయ రూ.60 పలకటంతో ప్రజలు బిత్తర పోతున్నారట. ఇంతేసి ధర పెట్టి కొంటున్నా.. నచ్చిన రీతిలో ఉల్లిపాయలు లేకపోవటంపై అక్కడి వారు గుస్సా అవుతున్నారట. ఉల్లి ధరలేమో కానీ లొల్లి మాత్రం భారీగా పెరిగిందని చెప్పక తప్పదు.