Begin typing your search above and press return to search.

భారత్ లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆ పని చేయట్లేదు

By:  Tupaki Desk   |   5 Dec 2021 1:39 AM GMT
భారత్ లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఆ పని చేయట్లేదు
X
గత వారం రోజులుగా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. డెల్టా వేరియంట్ ప్రమాదకరమని ఇదివరకు చెప్పిన వైద్య నిపుణులు... ఈ వేరియంట్ అంతకు మించి అని హెచ్చరిస్తున్నారు. జెట్ స్పీడ్ లో ఇది వ్యాపిస్తుందని అంటున్నారు. ఇక ఈ వేరియంట్ ను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి. పలు దేశాలు కరోనా నిబంధనలను మళ్లీ కఠినతరం చేశాయి.

కొత్త వేరియంట్లు ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్నా కూడా... కొందరిలో అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కు ధరించడంలో చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మనదేశంలో అయితే ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్కును పెట్టుకోవడం లేదు. లోకల్ సర్కిల్స్ అనే ఆన్ లైన్ సంస్థ దేశంలోని 364 జిల్లాల్లో దీనిపై సర్వే చేపట్టింది. మాస్కు ఆవశ్యకతపై ఇప్పటికే చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారని ఆ సర్వేలో వెల్లడైంది. మాస్కు ఆవశ్యకత అవసరమని ఏప్రిల్ లో 29 శాతం మంది అంటే... క్రమంగా అది తగ్గుతూ వస్తోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి 12... నవంబర్ నాటికి 2 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమే.

ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా మరికొన్నాళ్లు కరోనా నిబంధనలు సీరియస్ గా పాటించాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్కు పెట్టుకోవడం అనేది చాలా అవసరమని అంటున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇకపోతే స్వీయ నియంత్రణ, భౌతిక దూరం వంటివి తప్పవని చెబుతున్నారు. మాస్కును వేసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తే... అందుకు భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.

తొలుత దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్ వెలుగు చూసింది. అయితే వెంటనే ఇతర దేశాలు అలర్ట్ అయ్యాయి. భారత్ కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. అయినా కూడా మనదేశంలోకి ఒమిక్రాన్ అడుగుపెట్టింది. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 4 కేసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. కాగా ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ట్రేస్ చేయడంలో అధికారులు చురుగ్గా పని చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి... వైరస్ పాజిటివ్ అని తేలితే... వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపిస్తున్నారు.