Begin typing your search above and press return to search.

వైఎస్ రూపాయి కథ.. జగన్ ఆదర్శం

By:  Tupaki Desk   |   1 Jun 2019 6:17 AM GMT
వైఎస్ రూపాయి కథ.. జగన్ ఆదర్శం
X
ఇన్నాళ్లు సీఎంగా ఒక్క రూపాయి వేతనం తీసుకున్నది ఎన్టీఆరేనని చరిత్ర పుట్టల్లో మనం రాస్తున్నాం.. చదువుతున్నాం.. ఎన్టీఆర్ ను కీర్తిస్తున్నాం.. కానీ అంతకుముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రిగా ఒక్క రూపాయి తీసుకొని పనిచేశాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో రాకముందే గుల్బార్గాలో డాక్టర్ చదివాడు.. ఎంబీబీఎస్ చేసిన ఆయన పులివెందులలో తన తండ్రి పేరుమీదుగా 70 పడకల ఆస్పత్రి ప్రారంభించి ఉచిత వైద్యం అందించారు. రూపాయి మాత్రమేఫీజుగా తీసుకునేవారు. ఇక 1978లో వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం నాటి అంజయ్య కేబినెట్ లో వైఎస్ వైద్యఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. నాడు రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకోవడంతో రాయలసీమ వ్యథను చూసి తాను మంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే వేతనం తీసుకుంటానని.. తన జీతాన్ని ప్రజల సంక్షేమానికి వాడాలని సీఎంను కోరారు. దీనిపై అంజయ్య వైఎస్ ను మెచ్చుకుంటూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అది పత్రికల్లో అచ్చయ్యింది. అయితే ఇదే కేబినెట్ లో సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్న చంద్రబాబు మాత్రం జీతం తీసుకోవడం విశేషం.

ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్క రూపాయి వేతనం కథ వెలుగుచూసింది. 1983లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక్క రూపాయి వేతనం తీసుకోవడానికి ముందే వైఎస్ తీసుకోవడం విశేషం. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో జగన్ కూడా ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి తీసుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ కంటే ముందే వైఎస్ మంత్రిగా ఇలా తీసుకున్న విషయం చాలా మందికి తెలియదు. అలా తండ్రి వైఎస్ ప్రారంభించిన బాటలో తనయుడు నడుస్తున్నాడు. పులివెందుల వాసులు నాటి వైఎస్ ఒక్క రూపాయి కథ..ఇప్పుడు జగన్ కూడా అదే అవలంభించడంతో నాటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు.