Begin typing your search above and press return to search.

ఒక్క‌డి ఆదాయ‌పు ప‌న్ను 21870 కోట్లు

By:  Tupaki Desk   |   25 Jan 2017 11:20 AM GMT
ఒక్క‌డి ఆదాయ‌పు ప‌న్ను 21870 కోట్లు
X
ఒక్క‌డి ఆదాయ‌పు ప‌న్ను రూ. 21870 కోట్లు. ఎన్నో సంవ‌త్స‌రాల‌ది కాదు. ఒక్క ఏడాది మాత్ర‌మే. భార‌త‌దేశంలో శతకోటీశ్వరులు పెరుగుతున్న విషయాన్ని ఇటీవలే ఆక్స్‌ఫాం అనే సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు నూటికి నూరుపాళ్లు నిజమేనని ఆదాయం పన్ను శాఖ తాజా లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. దేశంలోని ఒక వ్యక్తి 2014-15 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆదాయం పన్ను రూ.21,870 కోట్లని ఆదాయం పన్ను శాఖ తాజా లెక్కలు వెల్లడించాయి. మొత్తం దేశంలోని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు చెల్లించే మొత్తంలో ఇది 11శాతం. అంతేకాదు ఇంకా అనేక ఆసక్తికర అంశాలు ఐటీ లెక్కల్లో కనిపిస్తున్నాయి.

దేశంలోని శతకోటీశ్వరుల్లో 64 మంది 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను చెల్లించాల్సిన మొత్తం రూ.1,13, 068 కోట్లుగా ఉంది. అందులో ముగ్గురు వ్యక్తులు తమ వ్యాపార ఆదాయాలు రూ.500 కోట్లకుపైనేనని వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులపై ఆర్జన రూ.500 కోట్లకు పైమాటేనని తేల్చారు. వీరి పేర్లను ఆదాయం పన్ను శాఖ బయటపెట్టలేదు. దేశంలో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులు 3.65 కోట్ల మంది ఉన్నారు. వీరు తమ పన్ను వేయదగిన ఆదాయం రూ.16.5 లక్షల కోట్లుగా ప్రకటించారు. దీనిపై ఆదాయం పన్నుగా రూ.1.91 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇది గత పన్ను మదింపు సంవత్సరం 2013-14లో 23%గా ఉండగా.. తాజాగా 37శాతానికి పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను 3.6 కోట్ల మంది వేతనాల రూపంలో తమకు రూ.9.8 లక్షల కోట్ల ఆదాయం ఉందని వెల్లడించారు. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరపు స్థూల జాతీయోత్పత్తిలో 7%తో సమానం. వ్యాపారస్తుల ఆదాయం రూ.5.6 లక్షల కోట్లుగా, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం రూ.2.4 లక్షల కోట్లుగా ఆదాయం పన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వార్షికాదాయం లక్షా50వేల రూపాయల లోపు ఉన్నవారు చెల్లించాల్సిన మొత్తం రూ.43,964 కోట్లుగా ఉంది. రూ.5,50,000-రూ.9,50,00 శ్లాబ్‌లో చెల్లించాల్సిన పన్ను రూ.17,926 కోట్లుగా మదింపు సందర్భంగా లెక్క తేలింది.

ఇక హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌ యూఎఫ్), కంపెనీలు - ఇతర సంస్థలు 2014-15 మదింపు సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.4,46,719 కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరంకంటే 13శాతం అధికం. 2000-01 సంవత్సరంతో పోల్చితే వ్యక్తిగత (సెక్యూరిటీ లావాదేవీల పన్ను సహా) తొమ్మిది రెట్లు పెరిగిందని ఆదాయం పన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అంకెల్లో చూస్తే ఇది రూ.31,764 కోట్ల నుంచి రూ.2.9 లక్షల కోట్లకు పెరిగింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/