Begin typing your search above and press return to search.

ఒక కుటుంబానికి ఒకే టికెట్... మరి లోకేష్ కధేంటి...?

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 AM GMT
ఒక కుటుంబానికి ఒకే టికెట్... మరి లోకేష్ కధేంటి...?
X
నాయకుడు అన్న వారు తాను ఆచరించి ఇతరులకు చూపిస్తే వారు చచ్చినట్లు దాన్ని అనుసరిస్తారు. కానీ తాను మినహాయింపులు కోరుతూ మీరు మాత్రం అలాగే చేయాలి అంటే చచ్చినా చేయరు. పైగా పేచీలు, గొడవలు వివాదాలు ఇలా చాలానే పుడతాయి. ఇక ఏ మాత్రం పట్టింపులు లేనిది క్రమశిక్షణకు చాలా తక్కువ అవకాశాలు ఉన్న రాజకీయాల్లో అయితే ఎటువంటి రూల్స్ తెచ్చినా సక్సెస్ కాకపోవడానికి కారణం నాయకులు, పై స్థాయిలోని వారు తమ వరకూ స్పెషల్ గా రిజర్వేషన్స్ పెట్టుకోవడమే.

విషయానికి వస్తే టీడీపీ అధినేత పార్టీని గాడిన పెట్టడానికి చాలానే చేస్తూ వస్తున్నారు. గతంలో కూడా ఆయన అలాగే చేశారు. అయితే నాలుగు దశాబ్దాల టీడీపీ ఇపుడు యుక్త కాదు, ప్రౌఢ. అంటే చాలా అనుభవం గడించింది. అదే ప్లస్ అదే మైనస్ గా మారిన నేపధ్యంలో చంద్రబాబు గతంలో చేయాలని చూసి ప్రయత్నించి విఫలం అయిన ఫార్ములాలను మళ్ళీ ట్రై చేస్తున్నారుట. అలాంటిదే ఒకటి కొత్తగా అనిపించే ఒక ఫ్యామిలీకి ఒక టికెట్.

నిజానికి ఇది ప్రతీ ఎన్నిక ముందూ చెబుతూ వస్తున్నదే. అలాగే బయట వారికి టికెట్లు ఇవ్వమని, ఇతర పార్టీల నుంచి దూకుళ్ళు చేసి చివరి క్షణంలో చేరిన వారికి నో టికెట్ అని కూడా బాబు అంటూ ఉంటారు. కానీ ఆపరేషన్ ఆకర్ష్ మాత్రం బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. మరో వైపు పనిచేసే వారికే టికెట్లు అంటారు. కానీ ఎన్నికల వేళకు ఫ్లైట్లు వేసుకుని దిగి వచ్చే వారికి అంగబలం అర్ధ బలం ఉన్న వారికే అవి దక్కుతాయి. అపుడు పనిమంతులు సైడ్ అవుతూంటారు

ఇక ఈసారి యువతకు టికెట్లు అని చాలా కాలనగా చంద్రబాబు చెబుతున్నారు. మరి ఆ యువత వారుసులా, లేక నిజంగా పార్టీ కోసం కష్టపడిన వారా అన్నది అర్ధం కావడంలేదు. ఇదిలా ఉంటే ఇపుడు ఒక ఫ్యామిలీ ఒక్క టికెట్ అంటూ పార్టీ సీనియర్లతో బాబు చర్చిస్తున్న విషయం అలా అలా పాకి పార్టీలో సీనియర్లకు గుండె దడ పుట్టిస్తోందిట. ఎందుకంటే టీడీపీలో ఇపుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. చంద్రబాబునే తీసుకుంటే ఆయనకు ఒక టికెట్ ఆయన కుమారుడు లోకేష్ కి ఒక టికెట్. బావమరిది బాలయ్యకు మరో టికెట్ గుడివాడలో ఎవరైనా నందమూరి ఫ్యామిలీ పోటీకి దిగితే ఇంకో టికెట్ ఇలా నాలుగు టికెట్లు అనివార్యంగా కనిపిస్తున్నాయి.

అదే రాయలసీమ నుంచి శ్రీకాకుళం దాకా తీసుకుంటే టీడీపీ ఫ్యామిలీస్ అలా పరుచుకుపోయాయి. ముందుగా కర్నూల్ జిల్లా చూసుకుంటే కేఈ క్రిష్ణ మూర్తి పెద్ద తలకాయ. పైగా పవర్ వుల్ బీసీ నేత. ఆయన కుమారుడు శ్యాం బాబుకు ఒక టికెట్ కావాలి. తమ్ముడు కేఈ ప్రభాకర్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. కర్నూలులో కోట్ల కుటుంబానికి పెద్ద పేరు ఉంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి లోక్‌సభకు పోటీ చేయాలని కోరుతుండగా ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు.

అలాగే నంద్యాలలో భూమా ఫ్యామిలీదే ఆధిపత్యం. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు బ్రహ్మానంద రెడ్డి టిక్కెట్ల రేసులో ఉన్నారు. ఇలా ఇక్కడే చాలా పోటీ కనిపిస్తోంది. టోటల్ గా టీడీపీలో అర్ధ సెంచరీ దాటేసిన ప్రముఖ కుటుంబాలు ఉన్నాయని లెక్కలేస్తున్నారు. ఇలా తీసుకుంటే వంద టికెట్లు వీరికే ఇవ్వాలి. కట్ చేస్తే యాభై నుంచి అరవై ఇవ్వాలి. అలా చేసినా వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందా అన్నదే పార్టీ ఆలోచిస్తోందిట.

దానికి ఉత్తమమైన మార్గం ఏంటి అంటే చంద్రబాబు ముందుగా తన కుమారుడికి టికెట్ ఈసారి ఇవ్వను అని చెప్పి తన ఇంటి నుంచే ఈ కటింగ్ ని ప్రవేశపెడితే ఆదర్శంగా ఉంటుంది, ఎవరూ నోరు విప్పరని అంటున్నారు. రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ ని ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎన్నికలు కీలకం అయినందువల్ల ఆయన్ని పోటీ నుంచి పక్కకు పెట్టి మొత్తం ఏపీ మీద ఫోకస్ చేసేలా తిప్పితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని కూడా అంటున్నారు. మరి బాబు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న ఈ విధానాన్ని ఎంచుకుంటారా లేక పుత్ర ప్రేమతో నాకు సెపరేట్. మీకు మాత్రం కట్ అంటే టీడీపీలో లొల్లి స్టార్ట్ అవడం ఖాయం.