Begin typing your search above and press return to search.

ఖాళీల భ‌ర్తీకి ఏడాది.. కేసీఆర్‌ కు కావాల్సింద‌దే!

By:  Tupaki Desk   |   12 March 2022 6:35 AM GMT
ఖాళీల భ‌ర్తీకి ఏడాది.. కేసీఆర్‌ కు కావాల్సింద‌దే!
X
తెలంగాణ‌లో నిరుద్యోగుల సెగ ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వాళ్ల‌ను కూల్ చేసేందుకు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఒకేసారి 91,142 పోస్టుల ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో 11,103 కాంట్రాక్టు ఉద్యోగ‌ల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అవి పోను మిగిలిన‌వి 80,039 పోస్టులు. ఈ పోస్టుల భ‌ర్తీకి ఆ రోజు వెంట‌నే ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు.

కానీ మూడు రోజులు గ‌డిచినా ఒక్క నోటిఫికేష‌న్ కూడా రాలేదు. మ‌రోవైపు ఇది ఎన్నిక‌ల స్టంట్ అని కేసీఆర్‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. చూస్తుంటే వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను కొన‌సాగించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. తాజాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్ జనార్ధ‌న్‌రెడ్డి మాట‌లు చూస్తుంటే అది నిజ‌మేన‌నిపిస్తోంది.

జ‌నార్ధ‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..

ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌కు ముందు కొంత క‌స‌ర‌త్తు జ‌రుగుతుంది. పోస్టుల‌ను గుర్తిస్తూ ఆర్థిక శాఖ జీవో ఇస్తుంది. రోస్ట‌ర్ ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు, విద్యార్హ‌త‌లు, స్పోర్ట్స్‌, దివ్యాంగుల కోటా వివ‌రాల‌తో నోటిఫికేష‌న్ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాలి. దీనికి 30 రోజుల స‌మ‌యం వ‌ర‌కూ ప‌డుతుంది. ఈ ప్ర‌తిపాద‌న‌లు నియామ‌క సంస్థ‌ల‌కు అందిన త‌ర్వాత ఆ వివ‌రాల‌ను స‌రిచూస్తారు.

దానికి మ‌రో వారం ప‌డుతుంది. అనంత‌రం ఉద్యోగ ప్ర‌క‌ట‌న జారీ చేసి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 45 రోజుల వ‌ర‌కు గ‌డువు ఉంటుంది. ఆ గ‌డువు ముగిశాక రాత ప‌రీక్ష‌కు మూడు నెల‌లు అవ‌స‌రం. వాటి మూల్యంక‌న‌కు మ‌రో నెల కావాలి. స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న, తుది ఫ‌లితాల వెల్ల‌డికి మ‌రో రెండు నెల‌లు ప‌డుతుంది.

కేసీఆర్ అనుకున్న‌ట్లుగానే..

జ‌నార్ధ‌న్‌ రెడ్డి వ్యాఖ్య‌లు చూస్తుంటే నోటిఫికేష‌న్ల జారీ నుంచి ఉద్యోగాల భ‌ర్తీ వ‌ర‌కు దాదాపు ఏడాది స‌మ‌యం ప‌డుతుంది. మ‌రోవైపు రాష్ట్రంలో కేసీఆర్ మ‌రోసారి ముంద‌స్తుకు వెళ్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అంటే వ‌చ్చే ఏడాది వేస‌వి కాలంలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. స‌రిగ్గా ఆ స‌మ‌యానికి ఈ ఉద్యోగ భ‌ర్తీల ప్ర‌క్రియ పూర్త‌యేలా కేసీఆర్ ప‌క్కా ప్ర‌ణాళిక వేశార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి.

అప్పుడు ఎలాగో నిరుద్యోగులు టీఆర్ఎస్‌ కే మ‌ద్ద‌తుగా నిలుస్తార‌న్న‌ది కేసీఆర్ ధీమా. అందుకే ఇప్ప‌టి నుంచి మొద‌లు పెడితే ఈ ఏడాది పాటు నిరుద్యోగుల్లో వ్య‌తిరేక‌త‌ను చ‌ల్లార్చేందుకు కేసీఆర్ వేసిన వ్యూహం ఇద‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.