Begin typing your search above and press return to search.

ఉల్లి బాంబ్ పేలనుంది..కేసీఆర్..జగన్ లు సిద్ధంగా ఉన్నారా?

By:  Tupaki Desk   |   22 Sep 2019 5:50 AM GMT
ఉల్లి బాంబ్ పేలనుంది..కేసీఆర్..జగన్ లు సిద్ధంగా ఉన్నారా?
X
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదన్న సామెత తెలిసిందే. కూరల్లో వాడే ఉల్లికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న చిన్నచూపు ఉంటే వెంటనే దాని నుంచి బయటపడాలి. ఎందుకంటే.. ఉల్లి ప్రభుత్వాల్నే కూల్చేసింది. నిత్యవసర వస్తువైన ఉల్లి విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉంటే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం ఎంతన్న విషయం చరిత్రను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ప్రభుత్వాల పతనాలకు కారణమైన ఉల్లి.. మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది. ఉల్లిపాయ ధరలు గడిచిన కొద్ది రోజులుగా పెరుగుతూ ఉంటే.. తాజాగా మరింతగా పెరిగి ఘాటెక్కిస్తున్నాయి. మొన్నటివరకూ కిలో ఉల్లి పాతిక కంటే తక్కువగా ఉన్న దాని స్థానే.. తాజాగా దాని ధర ఏకంగా కేజీ రూ.60 చేరుకోవటం గమనార్హం.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట ప్రభావితమైంది. వర్షాలతో పంట దెబ్బపడటంతో.. ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో.. మార్కెట్లో ఉల్లి డిమాండ్ పెరగటం.. అందుకు తగ్గట్లు సరఫరా లేకపోవటంతోధరలు భారీగా పెరగటం మొదలైంది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కేజీ ఉల్లి రూ.50 నుంచి రూ.54 పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి కేజీ రూ.60 వరకూ పలుకుతోంది.

గడిచిన రెండు వారాలుగా అంతకంతకూ పెరుగుతున్న ఉల్లి ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవంటున్నారు. ఉల్లి పంట ఎక్కువగా ఉండే కర్ణాటక.. మహారాష్ట్ర.. ఏపీ నుంచి సరఫరా కావాల్సిన ఉల్లి కావాల్సినంత మేర రాకపోవటంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పేలటానికి సిద్ధంగా ఉల్లి ధర బాంబును రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఉల్లి ధర పెరిగి.. ప్రజల్లో వ్యతిరేకత పెరిగే వరకూ వెయిట్ చేయకుండా.. ఇప్పటినుంచే అందుకు తగ్గ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. వర్షాల నేపథ్యంలో పంట పాడైనందున.. కొత్త పంట రావటానికి సమయం తీసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఉల్లి విషయంలో తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరు కాస్త అవగాహనతో ఉండి.. ముందుస్తు ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది. మరేం చేస్తారో చూడాలి.