Begin typing your search above and press return to search.

అమ్మాయిల్ని పంపుతామని 100 కోట్ల మోసం!

By:  Tupaki Desk   |   26 Sep 2018 8:28 AM GMT
అమ్మాయిల్ని పంపుతామని 100 కోట్ల మోసం!
X
ఎవ‌రికి వారు కోరుకున్న చోటకు కోరుకున్న అమ్మాయిల్ని పంపిస్తాం.. ఎంజాయ్ చేసేయండి అంటూ ఊరిస్తే ఎవ‌రు మాత్రం టెంప్ట్ కాకుండా ఉంటారు. ఈ బ‌ల‌హీన‌త‌ను ఆధారంగా చేసుకొని.. అమ్మాయి పేరు చెప్పి ఏకంగా రూ.100 కోట్ల వ‌ర‌కూ దోచేసిన ముఠాను సైబ‌రాబాద్ పోలీసులు ప‌ట్టేసుకున్నారు. ఈ ముఠా మొత్తం త‌న ఆప‌రేష‌న్స్ ను ప‌శ్చిమ బెంగాల్ నుంచి జ‌రుపుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ వీరు ఎలా వ‌ల వేస్తారంటే.. మూడు వేర్వేరు వెబ్ సైట్ల ద్వారా.. త‌మ ద‌గ్గ‌ర బోలెడంత‌మంది అమ్మాయిల ప్రొఫైల్స్ ఉన్నాయ‌ని.. కాకుంటే.. రిజిష్ట‌ర్ మెంబ‌ర్స్ మాత్ర‌మే చూసే వీలు ఉంటుంద‌ని చెబుతూ వ‌ల వేస్తారు.

ఇలాంటి సైట్ల విష‌యంలో ఎవ‌రికి వారు.. మూడో కంటికి తెలీకుండా వ్య‌వ‌హారాలు చేస్తుండ‌టంతో తాము మోస‌పోయినా బ‌య‌ట‌కు చెప్పుకోలేని దుస్థితి. ఒక‌వేళ ఎవ‌రికైనా చెప్పినా ప‌రువు పోతుంది. ఇంట్లో తెలిస్తే.. జ‌రిగే యుద్ధం అంతా ఇంతా కాదు. ఈ బ‌ల‌హీన‌త‌ల్ని అస‌రా చేసుకొని భారీగా ప్లాన్ చేశారు. ఎస్కార్ట్ సేవ‌లు అందిస్తామ‌ని చెబుతూ.. రిజిస్ట్రేష‌న్ మొద‌లు మీ వ్య‌క్తిత్వాన్ని త‌నిఖీ చేయాల్సి ఉంటుందంటూ డ‌బ్బులు వ‌సూలు చేస్తారు.

అంతా అయ్యాక‌.. మీరు కోరుకున్న అమ్మాయిని పంపాలంటే ఇంత మొత్తం చెల్లించాలంటూ స‌ద‌రు వ్య‌క్తి స్థాయిని బ‌ట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. ఒక్క‌సారి ఆ మొత్తాన్ని చెల్లించిన త‌ర్వాత‌.. ఇక అటు వైపు నుంచి ఎలాంటి స‌మాధానం ఉండ‌దు. కొన్నిసార్లు నెంబ‌ర్లు బ్లాక్ చేసేస్తారు కూడా.

హైద‌రాబాద్‌ కు చెందిన ఒక వ్య‌క్తి ఈ వెబ్ సైట్ మాయ‌లో ప‌డి ఏకంగా రూ.15 ల‌క్ష‌ల‌కు పైనే పోగొట్టుకున్నాడు. ధైర్యం చేసి సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. వెబ్ సైట్ ను ట్రాక్ చేసి.. ఈ ముఠా త‌న ఆప‌రేష‌న్స్ ప‌శ్చిమ‌బెంగాల్ లోని కోల్ క‌తా.. సిలిగురి నుంచి న‌డుపుతుంద‌ని గుర్తించి అక్క‌డ‌కు వెళ్లి.. ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. ఈ మొత్తం కుట్ర‌కు కీల‌క‌మైన ముగ్గురు మాత్రం త‌ప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పోలీసుల అంచ‌నా ప్ర‌కారం.. మొత్తం 20బ్రాంచ్ లు పెట్టి దాదాపు 400 మందికి పైగా టెలీ కాల‌ర్స్ ను రిక్రూట్ చేసుకొని ఈ దందా న‌డుపుతున్న‌ట్లు గుర్తించారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ కాల్ సెంట‌ర్ల‌లో ప‌ని చేసే అమ్మాయిలు.. అబ్బాయిల‌కు తాము చేస్తున్న‌ది త‌ప్పు అన్న విష‌యం రిక్రూట్ మెంట్ అప్పుడు తెలీదు. త‌ర్వాత ఉద్యోగం చేసే వేళ‌లో తెలిసినా.. జీతం కింద ఇచ్చే రూ.30వేలు.. ప్రోత్సాహ‌కం కింద ఏకంగా రూ.70వేల వ‌ర‌కూ ఇస్తూ ఉండ‌టంతో భారీ జీతాన్ని వ‌దిలి వెళ్ల‌లేక జాబ్ చేస్తున్నారు.

సైబ‌రాబాద్ పోలీసులు కోల్ క‌తా.. సిలిగురి వెళ్లి.. అక్క‌డి రెండు బ్రాంచ్ ల్లో త‌నిఖీలు నిర్వ‌హించి.. అక్క‌డి ఉద్యోగుల‌కు నోటీసులు ఇచ్చారు. మ‌రోవైపు.. ఎవ‌రికి అనుమానం రాకుండా ఉండేలా.. వేరే ఆఫీసు పేరు మీద కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఇక‌.. ఈ ముఠా దేశ వ్యాప్తంగా ప‌లువురిని అమ్మాయిల పేరుతో వ‌ల విసిరి.. వారి బ‌ల‌హీన‌త‌తో.. ఎలాంటి ఎస్కార్ట్ సేవ‌లు అందించ‌కుండా ఉంటూనే రోజుకు ద‌గ్గ‌ర్లో ద‌గ్గ‌ర 20ల‌క్ష‌ల వ‌ర‌కూ వ‌సూళ్లు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. మొత్తంగా ఏడాదికి రూ.72 కోట్ల‌కు పైనే ఆదాయం వ‌స్తుంద‌న్న‌ది స‌మాచారం. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో అదిరే ట్విస్ట్ ఏమంటే.. ఈ సేవ‌ల కోసం జీఎస్టీని వ‌సూలు చేయ‌టం. హైద‌రాబాద్ యువ‌కుడి నుంచి వ‌సూలు చేసిన రూ.15ల‌క్ష‌ల్లో దాదాపు రూ.72వేల వ‌ర‌కూ జీఎస్టీ కోసం వ‌సూలు చేయ‌టం. వెబ్ సైట్ల మాయ‌లో ప‌డి.. మోస‌పోవ‌ద్ద‌ని పోలీసులు సూచిస్తున్నారు. ఒక‌వేళ‌.. పొర‌పాటున మోస‌పోతే పోలీసుల దృష్టికి తీసుకెళితే ఈ మోస‌గాళ్ల ఆట‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.