Begin typing your search above and press return to search.

అసెంబ్లీ కూడా ఆన్‌ లైన్‌ అయిపోయింది..

By:  Tupaki Desk   |   27 Jun 2016 7:18 AM GMT
అసెంబ్లీ కూడా ఆన్‌ లైన్‌ అయిపోయింది..
X
టెక్నాలజీ ప్రపంచాన్ని పరుగులు తీయిస్తోంది. ఆ రంగం ఈ రంగం అని లేదు.. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. ప్రభుత్వాలు పాలన వ్యవహారాల్లోనూ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నాయి. పాలన ఇప్పటికే చాలా శాఖలు ఆన్ లైన్ అయిపోయాయి.. ఆన్ లైన్ లో ప్రజలకు సులభ సేవలందిస్తూ మన్ననలు పొందుతున్నాయి. రైల్వే శాఖనే ఉదాహరణగా తీసుకుంటే పదేళ్ల కిందట ఆన్ లైన్ సేవలు ఈ స్థాయిలో లేని కాలానికి.. ఇప్పుడు అంతా ఆన్ లైన్ అయిపోయి ట్రైన్ ఎక్కడానికి తప్ప ఇంక దేనికీ రైల్వే స్టేషన్ కు వెళ్లే అవసరం లేనంతగా సులభమైపోయింది. కేంద్రంతో పాటు రాష్ర్టాలు కూడా వివిధ శాఖలను ఆన్ లైన్ చేసి దూసుకెళ్తున్నాయి. ఏపీలో సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశాల్లో కాగితం ముక్కన్నది కనబడకుండా చేశారు. అందరికీ ఐప్యాడ్ లు ఇచ్చ అదరగొడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తెలంగాణ అసెంబ్లీ సభా వ్యవహారాలు ఆన్‌ లైన్‌ లోనే సాగించేందుకు నిర్ణయిం తీసుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో కాగిత రహిత కార్యకలాపాలు నిర్వహించేలా నిబంధనల కమిటీ నిర్ణయం తీసుకుంది. సభ్యుల స్థానాల వద్ద టచ్‌ స్క్రీన్‌ కంప్యూటర్లు ఏర్పాటుచేసేలా నిబంధనలకు కమిటీ సవరణలు చేసింది. అయితే.. సభ్యులకు దీనిపై శిక్షణ అవసరమన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొందరు మంత్రులు - ఎమ్మెల్యేలకు టెక్నాలజీపై మంచి పట్టున్నప్పటికీ కొందరు మాత్రం బాగా వీక్ గా ఉన్నారట. దీంతో ఎమ్మెల్యేల స్థానాల వద్ద టచ్ స్క్రీన్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే వాటిని ఎంతవరకు వినియోగించుకుంటారన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లపాటు ఆన్ లైన్ - ఆఫ్ లైన్ రెండు విధానాల్లో కార్యకలాపాలు నిర్వహించి ఆ తరువాత పూర్తిగా ఆన్ లైన్లోకి మారితే బెటరన్న అభిప్రాయం వినిపిస్తోంది.