Begin typing your search above and press return to search.

జీఎస్టీపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   10 Nov 2017 1:08 PM GMT
జీఎస్టీపై కేంద్రం కీల‌క నిర్ణ‌యం
X
మూడు వేల కోసం మూడు గంట‌ల పాటు క్యూలో నిలబెట్టినా ప్ర‌ధాని మీద కోపం ఎవ‌రికి రాలేదు. అస‌హ‌నం వ్య‌క్తం కాలేదు. కానీ.. జీఎస్టీ పేరుతో ప‌న్ను బాదుడుపై మాత్రం జాతి యావ‌త్తు ఒక్క‌సారిగా త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసింది. మూడున్న‌రేళ్లుగా ప్ర‌ధాని మోడీ ఏం చేసినా ఆశ‌గా.. ఆస‌క్తిగా ఎదురుచూసిన భార‌తావ‌ని.. అందుకు భిన్నంగా జీఎస్టీ విష‌యంలో మాత్రం త‌న నిర‌స‌న గ‌ళాన్ని వినిపించింది.

గ‌తంలో ప‌న్ను భారం పెరిగిన ప్ర‌తిసారీ ప్ర‌తిప‌క్షాలు రోడ్డు మీద‌కు వ‌చ్చి భారీ ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేసేవి. జీఎస్టీ విష‌యంలో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. జీఎస్టీ మీద ప్ర‌తిపక్షాలు పెద్ద‌గా రియాక్ట్ అయ్యింది లేదు. మోడీ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు చేశారే కానీ.. బ‌ల‌మైన నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసింది లేదు.
విప‌క్షాలు చూసీ చూడ‌న‌ట్లుగా ఉన్నా భార‌తావ‌ని మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించింది. త‌మ‌కు ల‌భించిన ఏ వేదిక‌ను విడిచిపెట్ట‌కుండా జీఎస్టీపై త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. పెద్ద మాట‌లు ఏమీ లేకుండా త‌మ ఆవేద‌న‌ను జోకులు.. వ్యంగ్య వ్యాఖ్య‌ల రూపంలో వెల్ల‌డించారు.

సైలెంట్ గా సాగుతున్న ఈ ఆక్రోశం.. ఎవ‌రి మాట విన‌ని మోడీ స‌ర్కారును సైతం క‌దిలించింది. ఈ మ‌ధ్య‌న జీఎస్టీ శ్లాబుల మీద నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. 177 వ‌స్తువుల ప‌న్ను శ్లాబుల్ని భారీగా త‌గ్గిస్తూ కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 28 శాతం పన్నుశ్లాబులో ఉన్న వ‌స్తువుల్లో 177 వ‌స్తువుల్ని.. వ‌స్తుసేవ‌ల ప‌న్ను శ్లాబును 18 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. దీంతో.. చాక్లెట్లు.. చూయింగ్ గ‌మ్ లు.. షాంపూలు.. డియోడ‌రంట్ లు.. షూపాలిష్.. డిట‌ర్జెంట్‌.. పోష‌కాహార పానీయాలు.. కాస్మోటిక్స్ ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి.

జీఎస్టీని అమ‌ల్లోకి తెచ్చిన‌ప్పుడు 5.. 12..18..28 శాతం శ్లాబుల్ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అత్య‌ధిక ప‌న్ను శ్లాబు అయిన 28 శాతం కింద మొత్తం 227 వ‌స్తువుల్ని.. వ‌స్తు సేవ‌ల్ని ఉంచారు. ఈ శ్లాబుపై దేశ ప్ర‌జ‌ల్లో తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీంతో ఫిట్ మెంట్ క‌మిటీ 62 వ‌స్తువుల్ని 28 శాతం శ్లాబు నుంచి తొల‌గించాల‌ని సిఫార్సు చేసింది.

మామూలుగా అయితే సిఫార్సు చేసిన వ‌స్తువుల్ని అత్య‌ధిక శ్లాబ్ నుంచి తొల‌గించ‌ట‌మే గొప్ప‌. అందుకు భిన్నంగా క‌మిటీ సిఫార్సుకు భిన్నంగా 177 వ‌స్తువుల‌ను 28 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేకం వ‌స్తుండ‌టం.. రెండు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జీఎస్టీ ప్ర‌భావం క‌నిపిస్తుంద‌న్న వాద‌న‌ల నేప‌థ్యంలో భారీ ఎత్తున వ‌స్తువుల్ని అత్య‌ధిక ప‌న్నుశాతం ఉన్న‌శ్లాబు నుంచి తొల‌గించ‌టం గ‌మ‌నార్హం. తాజా నిర్ణ‌యం దేశ ప్ర‌జ‌ల మీద ప‌డిన భారం త‌గ్గించటం ఖాయం. 28 శాతం శ్లాబులో ఉన్న 50 వ‌స్తువుల్లో సిమెంట్‌.. పెయింట్స్‌.. విలాస వ‌స్తువులు.. వాషింగ్ మెషీన్లు.. ఎయిర్ కండీష‌న్లను గ‌రిష్ఠ ప‌న్ను శ్లాబులోనే ఉంచారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో కేంద్రంపై రూ.20వేల కోట్ల మేర ఆదాయం కోల్పోతుంద‌న్న అంచ‌నా వ్య‌క్త‌మ‌వుతోంది.