Begin typing your search above and press return to search.

వారిద్దరిలో ఒకరే ట్రంప్ మీద పోటీ చేసేది

By:  Tupaki Desk   |   5 March 2020 4:50 AM GMT
వారిద్దరిలో ఒకరే ట్రంప్ మీద పోటీ చేసేది
X
మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలోకి దిగుతుంటే.. ఆయనపై పోటీ చేసేందుకు డెమొక్రాట్ల అభ్యర్థిగా ప్రస్తుతం ఇద్దరు రేసులో నిలిచారు. మన దగ్గర జరిగే ఎన్నికల విధానానికి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధం ఉండదు. అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీ పడటానికి ముందు.. ఒకే పార్టీకి చెందిన ఆశావాహులు ఎన్నికల బరిలోకి దిగుతారు. ఎవరైతే అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకుంటారో.. వారే అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తారు.

ట్రంప్ మీద పోటీ చేసేందుకు డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరన్న విషయంపై కాస్తంత క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం బరిలో ఉన్న వారిలో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్.. రెండో వ్యక్తిగా బెర్నీ శాండర్స్ మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. మంగళవారం జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో వీరిద్దరూ గణనీయమైన రీతిలో విజయాలు సాధించటం గమనార్హం.

సూపర్ ట్యూస్ డే ప్రైమరీ ఎన్నికల్లో జోబైడెన్ తొమ్మిది స్థానాల్ని సొంతం చేసుకోగా.. నాలుగు చోట్ల శాండర్స్ తన అధిక్యతను ప్రదర్శించారు. తాజాగా వెల్లడైన ప్రైమరీ ఎన్నికల్లో బైడన్ తరఫున మొత్తం 342 మంది ప్రతినిధులు గెలుపొందారు.గతంలో జరిగిన ఎన్నికల్ని కలిపిన పక్షంలో 395 మంది ప్రతినిధుల మద్దతు బైడెన్ కు దక్కినట్లైంది. అదే సమయంలో శాండర్స్ కు ప్రైమరీల ద్వారా 245 మంది మద్దతు లభించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన వాటిని కలుపుకుంటే మొత్తం 305 మంది మద్దతు ఆయనకు లభించినట్లుగా చెప్పాలి. మొత్తంగా బైడెన్.. శాండర్స్ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. మరి..ట్రంప్ మీద పోటీ చేసేందుకు వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.