Begin typing your search above and press return to search.

హోల్ ఎగ్జామ్‌ సెంట‌ర్‌ కి విద్యార్థి ఒక్క‌డే!

By:  Tupaki Desk   |   7 Jun 2018 6:56 AM GMT
హోల్ ఎగ్జామ్‌ సెంట‌ర్‌ కి విద్యార్థి ఒక్క‌డే!
X
మార్చి పోతే సెప్టెంబ‌రు అని అనుకునే రోజులు పోయాయి . అస‌లు ఫెయిల‌య్యే విద్యార్థుల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. ఇపుడు 95-96-97 శాతం మార్కులు రాలేద‌ని ఏడ్చే వాళ్లే గాని ఫెయిల‌య్యామ‌ని ఏడ్చే వాళ్లు లేరు. మొన్నే ఒక విద్యార్థిని ఎంతో బాగా చ‌దువుకుని కేవ‌లం నీట్ ప‌రీక్షలో త‌ప్పింద‌ని దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇంత‌కు ముందు పిల్ల‌లు ఫెయిల‌యితే త‌ల్లిదండ్రులు బాధ‌ప‌డుతూ పిల్ల‌ల‌ను తిట్టేవారు. కానీ ఇపుడు పిల్ల‌లు ఎక్క‌డ ఏడుస్తారో - ఏమైనా చేసుకుంటారేమో అని త‌ల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

అయితే, స‌ప్లిమెంట‌రీల‌కు హాజ‌ర‌య్యేవారి శాతం బాగా త‌గ్గిన మాట వాస్త‌వం. ఈరోజు జ‌రిగిన ఒక సంఘ‌ట‌న విద్యా వ్య‌వ‌స్థ మార్పుల‌కు ఒక ప‌రాకాష్ట‌. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఎస్సెస్సీ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా హిందీ పరీక్షకు జ‌రిగిన సప్లిమెంట‌రీకి ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. మొత్తం ఏడు మంది ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసినా ఒక్క‌రు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు ఈ పరీక్షకు జమ్మికుంట విద్యోదయ పాఠశాల విద్యార్థి కోండ్ర ప్రణయ్ మాత్ర‌మే హాజ‌రై ప‌రీక్ష రాశాడు.

అయితే నిబంధ‌న‌ల ప్ర‌కారం పిల్ల‌లు ఎంత మంది రాసినా ప‌ర్యవేక్షక సిబ్బందిని మాత్రం క‌చ్చితంగా ఉంచాల్సిందే. అందులో భాగంగా ఆ ఒక్క విద్యార్థి కోసం ఛీప్‌ సూపరింటెండెంట్ తో పాటు డిపార్ట్‌ మెంట్‌ అధికారి - క్లర్క్ - ఇన్విజిలేటర్ - అటెండర్ - వైద్యశాఖ ఉద్యోగి స్కూలుకు హాజ‌ర‌య్యారు. వీరితో పాటు ప‌రీక్ష విధుల్లో భాగంగా ఇద్దరు పోలీసులను కూడా కేటాయించారు. ఈ ఒక్క‌రి కోసం తనిఖీ నిమిత్తం ఇద్దరు చొప్పున కరీంనగర్‌ నుంచి రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు వచ్చాయి. ఒక్క విద్యార్థి పరీక్ష రాస్తే... మొత్తం సిబ్బంది 12 మంది అయ్యారు. ఇది ఈ పాఠ‌శాల చ‌రిత్ర‌లోనే కాదు - జిల్లా చ‌రిత్ర‌లోనే అరుదైన ఘ‌ట‌నగా చెబుతున్నారు.