Begin typing your search above and press return to search.

కోహ్లి వెంట అతడొక్కడేనా..?

By:  Tupaki Desk   |   6 Sep 2022 2:30 AM GMT
కోహ్లి వెంట అతడొక్కడేనా..?
X
2022 విరాట్ కోహ్లికి చాలా క్లిష్టంగా గడుస్తోంది. టెస్టు కెప్టెన్సీ వదులుకుని పరిమిత ఓవర్ల కెప్టెన్సీలో కొనసాగుదామంటే.. కుదరలేదు. టి20లు, వన్డేల సారథ్యం వదులుకోవాల్సి
వచ్చింది. బీసీసీఐతో విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ఫామ్ మరింత దిగజారింది. ఓ దశలో జట్టులో చోటే
ప్రశ్నార్థకమైంది. కుర్రాళ్లు దూసుకొస్తుండడంతో టి20 జట్టులో చోటే కష్టం అనే పరిస్థితి వచ్చింది.

అయితే, ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో కోహ్లి మునుపటి ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు క్రీజులో నిలిచాడు. పూర్వం మాదిరిగా షాట్లు కొడుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాడు. కాగా, ఇన్నాళ్లూ ఫామ్ లో లేకపోవడంతో వచ్చిన విమర్శలపై స్పందించాడు. టీవీల ఎదుట కూర్చొని, ప్రపంచం మొత్తానికి తెలిసేలా సలహాలు ఇస్తే అస్సలు పట్టించుకోనని అ. నిన్న ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడాడు.

ఈ సందర్భంగా తనకు ధోనితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో మరోసారి వివరించాడు. విమర్శకులకు దీటుగా సమాధానమిచ్చాడు. ఇక ధోనీతో అనుబంధం గురించి కోహ్లీ మాట్లాడుతూ"నేను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. గతంలో నేను అతడితో కలిసి ఆడాను. ఆ వ్యక్తి ఎమ్మెస్‌ ధోనీ. మరెవరూ నాకు మెసేజ్‌లు చేయలేదు. నా ఫోన్‌నంబర్‌ చాలా మంది వద్ద ఉంది. చాలా మంది నాకు టీవీల్లో సలహాలు ఇస్తున్నారు. కానీ, ధోనీ ఒక్కడే వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడు. మీకు ఎవరితోనైనా నిజాయతీతో కూడిన సంబంధాలు ఉంటే.. మీకు ఇరువైపుల నుంచి నమ్మకముందన్న విషయం అర్థమవుతుంది. నేను అతడి నుంచి ఏమీ ఆశించలేదు.. అతడు నా నుంచి ఏమీ ఆశించలేదు. మేము ఇద్దరం పరస్పరం అభద్రతా భావంతో ఎప్పుడూ లేము" అని అన్నాడు.

అప్పట్లో ధోనీ డిప్యూటీగా.. కోహ్లి కెరీర్ ఆరంభం నుంచి ధోనీ కెప్టెన్సీలోనే ఆడాడు. జట్టులో చోటు కోల్పోవడం, తిరిగి రావడం, స్టార్ బ్యాట్స్ మన్ కావడం, వైస్ కెప్టెన్ కావడం, కెప్టెన్ కావడం అన్నీ ధోనీ జమానాలోనే జరిగాయి. కాబట్టి కోహ్లికి ధోనీ అంటే ప్రత్యేక అభిమానం. అయితే, కోహ్లి మూడేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. మరీ ముఖ్యంగా గత ఏడాదిన్నర నుంచి అతడి బ్యాటింగ్ స్థాయి సాధారణంగా ఉంది. దీంతో కోహ్లి పనై పోయిందనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అంతేగాక.. ఎన్నడూ లేనివిధంగా తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ లో నెల రోజులు విశ్రాంతి
తీసుకున్నాడు. బ్యాట్ పట్టుకోకుండా ఇంట్లో గడిపాడు. అన్నిటికి మించి తాను డిప్రెషన్ కు గురయ్యాననే సంకేతాలు ఇచ్చాడు. దీంతో కోహ్లిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అతడి
టెక్నిక్ నుంచి ఆటిట్యూడ్ వరకు చర్చ జరిగిన చోటనే.. అతడి వైఫల్యాలపై చర్చ జరగడం గమనార్హం.

ధోనీ చెప్పాడంటే మిగతావారు చెప్పలేదనా? కెప్టెన్సీ వదులుకున్న సందర్భంలో ధోనీ మాత్రమే వ్యక్తిగతంగా మెసేజ్ చేశాడని.. చెప్పాడంటే కోహ్లికి మిగతావారెవరూ మెసేజ్ చేయలేదనే భావించాలి. ప్రస్తుత జట్టులో కోహ్లికి అండర్ 19 దశ నుంచి సహచరుడు రవీంద్ర జడేజా. ఇక రోహిత్, కోహ్లి కాస్త అటుఇటుగా ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. అయితే, 2019 ప్రపంచ కప్ అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయనే వార్తలు వచ్చాయి.

దీనికితగ్గట్లే వాతావరణ పరిస్థితులు కనిపించాయి. కాగా, ఈ ఏడాది అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని కోహ్లి నుంచి రోహిత్ దక్కించుకున్నాడు. అయితే, తాజా మాజీ కెప్టెన్ గా రోహిత్ కూడా కోహ్లికి కెప్టెన్సీని వదిలేసుకున్నప్పుడు మెసేజ్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు జట్టులో ఉన్న మిగతావారంతా జూనియర్లు కాబట్టి.. వారి చెప్పినా చెప్పకున్నా పెద్దగా విశేషం కాదు. అయితే, తనకు ధోనీ తప్ప ఎవరూ మెసేజ్ చేయలేదని ఇప్పుడు కోహ్లి అంటున్నాడంటే.. అది పరోక్షంగా రోహిత్ గురించే అనుకోవాల్సి ఉంటుందేమో? కాగా, ఈ అంశంపై లోతుగా చర్చించేకంటే ఒక ప్రొఫెషనల్ అంతర్జాతీయ క్రికెటర్ గా ఇలాంటి చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తారా? అనేది కూడా చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.