Begin typing your search above and press return to search.

రెండు మూడురోజులే.. ఈలోగా కుమ్మేయండి!

By:  Tupaki Desk   |   25 July 2017 12:30 AM GMT
రెండు మూడురోజులే.. ఈలోగా కుమ్మేయండి!
X
యావత్తు రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. నంద్యాల ఉపఎన్నికల బరిలోనే మోహరించిన... సమస్త తెలుగుదేశం గణాలకు ఇప్పుడు మరో స్పష్టమైన దిశానిర్దేశం అందింది. మంత్రులంతా ఇక్కడే ఉండి.. ప్రభుత్వమే నంద్యాల కేంద్రంగా నడుస్తున్నదా అన్నంత బిల్డప్ ను ప్రజల్లో కలిగిస్తున్నారు. రకరకాల కార్యక్రమాలకు శ్రీకారాలు - ప్రారంభోత్సవాలు చేసేస్తున్నారు. అయితే ఈ సమయంలో వారికి అందిన తాజా సూచన కూడా అదే! ఇలాంటి అడ్డగోలు రిబ్బను కత్తిరింపులు - పథకాల ప్రారంభాలు - శంకుస్థాపనలు తదితర వ్యవహారాలకు ఇంకా కేవలం రెండు మూడు రోజుల గడువు మాత్రమే ఉన్నది. ఈలోగా వేగిర పడాలి.. త్వరత్వరగా పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వం మనకోసం చాలా చేసేస్తోంది అనే ఫీలింగ్ నంద్యాల ప్రజల మనసుల్లో పెట్టాలి.. అనేది వారికి అందిన సూచన.

రెండు మూడురోజుల గడువు గురించి తెదేపా అధినాయకత్వం ఆత్రుత పడడానికి - ఆ మేరకు తమ వాళ్లకు సూచనలు చేయడానికి తొందరపెట్టడానికి సహేతుకమైన కారణమే ఉంది. నంద్యాల ఎమ్మెల్యే స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడబోతోంది. మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని , రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెబుతున్నారు. షెడ్యూల్ విడుదల కావడం అంటే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. ఎన్నికల గంట మోగినట్టే.

అంటే.. చంద్రబాబు ఇప్పుడు చెలరేగుతున్నట్లుగా ప్రభుత్వ కార్యక్రమం పెట్టి పథకాల వితరణ చేసేస్తూ.. మా పార్టీని గెలిపించండి అంటూ ప్రభుత్వ వేదిక మీదినుంచిచ కోరుకోవడానికి గానీ.. అర్దరాత్రి దాటాక 12.30 గంటలు అవుతున్నా సరే.. అధికారిక కార్యక్రమాల పేరుతో ప్రజలతో సమావేశాలు నిర్వహించడానికి గానీ అవకాశం ఉండదు. వాటన్నిటిని పక్కన పెట్టాల్సి వస్తుంది. కోడ్‌ను ధిక్కరిస్తే కేసులు నమోదు అవుతాయి. అందుకే తెదేపా నాయకులు ఇప్పుడు తొందరపడుతున్నారు... ప్రభుత్వ పరంగా నంద్యాల ప్రజలను ఎన్నిరకాలుగా మభ్యపెట్టడానికి అవకాశం ఉన్నదో ఆ పర్వం మొత్తం రెండు మూడు రోజుల్లోగానే పూర్తిచేసేయాలని లేకపోతే ఆ తర్వాత.. కుదరదని.. ఎన్నికల సమరాంగణం వేడెక్కుతుందని వారు భావిస్తున్నారట.